మహారాష్ట్ర నుంచి మిడతలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించే అవకాశముందని, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి మిడతల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అగ్నిమాపక అధికారులు, శాస్త్రవేత్తలతో కలెక్టర్ సమావేశమయ్యారు. మిడతల దండు ప్రవేశిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
మిడతలు పంట నష్టం చేయకుండా అగ్నిమాపక సిబ్బంది రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించారు. అధికారులు చెప్పిన రసాయనాలు చల్లి రైతులు పంటలు కాపాడుకోవాలని కలెక్టర్ రైతులకూ సూచించారు. జిల్లాలో ఏ ప్రాంతంలో మిడతల వల్ల సమస్యలు వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 18001203244 కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారి సంధ్యారాణి, వ్యవసాయ అధికారి ఆశా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు