ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మూసి ఉన్నాయి. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌లలో ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. చుట్టుపక్కల మండల వాసులు ఇక్కడికే రిజిస్ట్రేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ఎక్కడ చూసినా పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా ఉండడంతో జనం రాక ఈ కార్యాలయాలు వెలవెలబోయాయి. దీనికితోడు దస్తావేజులు పూరించే డాక్యుమెంటరీ రైటర్లు లేకపోవడంతోనూ ఇవి నిలిచిపోయాయి. ఏప్రిల్ నెలలో ఆదిలాబాద్‌ల్ 7, బోథ్‌లో 3 మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం ఇందుకు నిదర్శనం.
రూ.కోట్లలో ఆదాయానికి గండి
బుధ,గురువారాల్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా రుణాల కోసం ఆస్తులను మార్ట్‌గేజ్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌కు వస్తున్నారు. గతంతో పోలిస్తే సగం దస్తావేజులు సైతం రిజిస్ట్రేషన్లు కావడంలేదు. దీంతో ఆదాయం భారీగా తగ్గింది. కేవలం ఒక్క ఆదిలాబాద్‌లోనే నెలకు రూ.కోటిన్నరకుపైగా వచ్చే ఆదాయం ప్రభుత్వం కోల్పోయింది.
లాక్‌డౌన్‌కంటే ముందు దరఖాస్తు చేసుకున్నా
రిజిస్ట్రేషన్‌కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఏ తేదీకి రావాలనేది స్లాట్ తీసుకుంటారు. ఇలా ఆదిలాబాద్‌లో జనతా కర్ఫ్యూ కంటే ముందే మూడు రోజులకు సంబంధించి 80 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్‌కోసం ఆదిలాబాద్‌లో రోజుకు 36 స్లాట్లు ఇచ్చేవారు. ఆదాయం వస్తుందని తాజాగా వాటిని రోజుకు 60కి పెంచారు. అయినా జనం రిజిస్ట్రేషన్‌కు విముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
రవాణా లేకే..
పట్టణంతోపాటు జైనథ్, బేల, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, భీంపూర్ మండలవాసులు ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలోని ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మార్ట్‌గేజ్ ఇతర రిజిస్ట్రేషన్లకు ఆదిలాబాద్‌కే రావాలి. బోథ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బోథ్‌తో పాటు నేరడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, సిరికొండ మండలాల వాసులు రిజిస్ట్రేషన్‌కు వెళ్తారు. గుడిహత్నూర్ వాసులకు మాత్రం అక్కడే మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు. అయితే బస్సులు, జీపులు ఇతర రవాణ మార్గం లేకపోవడంతో చాలా మందికి కార్యాలయానికి వచ్చేందుకు అవకాశం లేదు. పైగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వెళ్లినా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు ఉన్న వారు సైతం రిజిస్ట్రేషన్ అవసరం ఉన్నా రావడం లేదు. రవాణాలో నిబంధనలు సడలింపులు ఇచ్చాకే ఇవి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.