రెవెన్యూశాఖ ప్రాణాధారమైన రికార్డులు, దస్త్రాలు కనిపించకుండా పోతున్నాయి. అవి కనిపించడం లేదా..? కనిపించకుండా చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమిలేని నిరుపేదలు, వివిధ పథకాలు, పునరావాసం కింద ప్రభుత్వ భూములను అసైన్డ్ వివరాలను వెల్లడించేందుకు ప్రతి తహసీల్దారు కార్యాలయంలో ప్రత్యేకంగా అసైన్‌మెంట్ రివ్యూ కమిటీ (ఏఆర్‌సీ) రిజిస్టర్ ఉంటుంది. ఇది తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూములకు సంబంధించి గుండెకాయ లాంటిది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీఓ) ఛైర్మన్‌గా ఆ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు సభ్యులుగా కమిటీ ఉండేది. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించింది. నియోజకవర్గ శాసనసభ్యుడు ఛైర్మన్‌గా, ఆర్డీఓ కన్వీనర్‌గా డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు సభ్యులుగా మార్పు చేసింది. ఫలితంగా ఏ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎంత ఉందనేది ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయిలో తెలుసుకునే వెసులుబాటు కలిగింది. అలాంటి రిజిస్టర్ ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాల్లో కనిపించడం లేదు.
బోథ్ అటవీ రేంజ్ పరిధిలో దాదాపుగా 150 ఎకరాలు అన్యాక్రాంతమైన వ్యవహారం ఇటీవల ‘ఈనాడు-ఈటీవీ’ పరిశోధనలో వెలుగుచూసింది. అభయారణ్యం పరిధిలోకి వచ్చే దాదాపు 150 ఎకరాలకు రెవెన్యూ అధికారులు అసైన్డ్ చేస్తూ పట్టాలు ఇచ్చినట్లు అటవీశాఖ ప్రాథమికంగా నిర్ధరించింది. రెవెన్యూ అధికారులు ఏ ప్రాతిపదికన ఆ భూములను అసైన్డ్ చేశారనేది ఏఆర్‌సీ పట్టికలో పొందుపర్చాల్సి ఉంది. తహసీల్దార్ మారినా ఆ రిజిస్టర్ అందుబాటులో ఉండాలి. కానీ బోథ్ తహసీల్దార్ కార్యాలయంలో అది కనిపించడం లేదు.
ఖానాపూర్ అటవీప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో దాదాపుగా 50 ఎకరాల భూమిని కుర్రు ప్రాంతంగా అటవీశాఖ ఏళ్లకిందనే గుర్తించింది. రెండుపాయలుగా చీలే గోదావరి ఆ తర్వాత మళ్లీ కలుస్తోంది. ఈ మధ్యన ఉండే భూమి కుర్రు ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది. ఆ కుర్రు ప్రాంతంలో చాలామంది నిరుపేదలకు తెదేపా హయాంలోనే ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేయడమే కాకుండా పట్టాలు సైతం జారీ చేసింది. కానీ ఓ కీలకనేత అందులో దాదాపు 35 ఎకరాలకుపైగా తనభూమిగా ప్రకటించుకోవడం కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. అక్కడ ఏఆర్‌సీ రిజిస్టర్ ప్రకారం భూములను ఎవరికి అసైన్డ్ చేశారనేది రెవెన్యూశాఖ తేల్చితే అసలు వివాదామే తలెత్తదు. ఏఆర్‌సీ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇప్పటికీ అటవీ, రెవెన్యూశాఖల మధ్య సమన్వయం కుదరడం లేదు.
రిజిస్టర్ లేక భూములు మాయం..
తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన ఓ వ్యక్తికి, ముథోల్ రెవెన్యూడివిజన్ పరిధిలోని మరో వ్యక్తికి నిర్మల్ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్పీ) ముంపు పేరిట ఏ విధంగా ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేశారనేది వెల్లడించడానికి ఏఆర్‌సీ రిజిస్టరే అందుబాటులో లేదు. అంతా రెవెన్యూ అధికారుల మాయగా కనిపిస్తుంటే కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు పలుకుబడి ఉన్న వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి.
నేతల హస్తం
రెవెన్యూ డివిజన్ పరిధిలోని అసైన్డ్ చేసిన ప్రతి సెంటు భూమి ఏఆర్‌సీ పట్టికలో నమోదు చేస్తే వివరాలు ఎప్పటికైనా వెల్లడయ్యే అవకాశం ఉంది. అందుకని కొంతమంది ఆ రిజిస్టర్లనే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయిదు రెవెన్యూ డివిజన్లు ఉంటే 52 మండలాలు ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్లతో ఆదిలాబాద్ జిల్లా అవతరించింది. నిర్మల్, భైంసా రెవెన్యూ డివిజన్లతో నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్లతో కుమురం భీం జిల్లా, మంచిర్యాల, బెలంపల్లి రెవెన్యూ డివిజన్లతో మంచిర్యాల జిల్లా ఏర్పడింది. ఈ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ భూముల అసైన్డ్ వివరాలను వెల్లడించేలా శాసనసభ్యుల నేతృత్వంలో సమీక్ష నిర్వహిస్తే మండలాల వారీగా ఏఆర్‌సీ రిజిస్టర్ల వ్యవహారం తెలిసే అవకాశం ఉంది. సమీక్ష సమావేశాలే జరగకపోవడం వల్ల రిజిస్టర్ల ప్రస్తావన రావడంలేదు. ఫలితంగా కొంతమంది నేతలు చక్రం తిప్పుతూ తహసీల్దార్ల సాయంతో భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'