ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో జంబుగ నర్సరీ ఉద్యాన పంటలకు ఊతం ఇస్తోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 1989లో ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ నర్సరీ కం ట్రైనింగ్ సెంటర్ పేరిట ప్రారంభమైంది ఈ కేంద్రం. 86 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. వాటి నుంచి ఏటా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
త్వరలోనే ఆయిల్ మిల్:
ఈ ప్రాంతంలోని గిరిజనులకు వివిధ రకాల మొక్కలు అంటు కట్టు విధానంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం నీటి వనరులు బాగా ఉండటం వల్ల 1998లో ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామింగ్ రీసర్చ్ సెంటర్ ద్వారా పామాయిల్ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. వాటి ఎదుగుదల బాగా ఉండటం వల్ల ఇటీవల శాస్త్రవేత్తలు సందర్శించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ఆయిల్ మిల్ నెలకొల్పనున్నారు. దీని వల్ల ఉపాధి లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
86 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ:
పండ్ల తోటల సాగులో జిల్లాలోనే ప్రత్యేక చోటు సంపాదించుకుంది జంబుగ నర్సరీ. కాగజ్నగర్ మండలం జంబుగ శివారులో 1989లో 86 ఎకరాలను నర్సరీకి కేటాయించారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, రేగు, చింతచెట్లతో 300 పామాయిల్ మొక్కలను నాటారు.
ఆదాయం మెండుగా:
మామిడి ద్వారా 7 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం, నిమ్మ ద్వారా 40 వేల ఆదాయం, సపోటా ద్వారా 80 వేల నుండి లక్ష వరకు ఆదాయం వస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. అన్ని ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదు. సరైన కూలీ రావడం లేదని కూలీలు నర్సరీలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. రైతులు వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి చూపడం... ఉద్యానవన పంటలు ఖర్చుతో కూడుకున్న పనిగా భావించడం... మరో కారణంగా పేర్కొనవచ్చు.
త్వరలోనే ఆయిల్ మిల్
వారం రోజులు క్రితం నర్సరీని రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి ప్రసాద్, తెలంగాణ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ స్టేట్ ఆయిల్ఫెడ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. పామాయిల్ మొక్కలకు అనువైన ప్రదేశంగా గుర్తించారు. త్వరలోనే ఇక్కడ ఆయిల్ మిల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జంబుగ నర్సరీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే... పర్యటకంగానూ అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: వారికి ఇల్లే ఓ గ్రంథాలయం... పుస్తకాలే నేస్తాలు..!