ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు జరకపోవడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 38 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లక్షలాదిమంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ఉట్నూర్లో ఐటీడీఏ కార్యాలయం ఉంది. కొన్నేళ్ల నుంచి అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వారి సమస్యలను ఐటీడీఏకు తెలుపుతున్నారు. ఐటీడీఏ అధికారులతో పాటు జిల్లా పాలనాధికారి, ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను పరిష్కరిస్తారు.
ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజనులకు.. విద్య, వైద్య, రోడ్డు, వ్యవసాయం, వారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అందించేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవాలి. వచ్చే సమావేశంలో ఇంతకుముందు సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అని విచారణ జరపాలి.
కానీ.. ఐటీడీఏ పాలకవర్గ సమావేశం గతేడాది అక్టోబర్ 30న నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు మరోసారి పాలకవర్గ సమావేశం నిర్వహించకపోవడం వల్ల జిల్లాలోని ఆదివాసీలు, గిరిజనులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.