ఆదిలాబాద్ గ్రామీణ మండలం బీంసారి వాగులో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 2.85 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్లు పనులకు అడ్డంకిగా మారాయి. గుత్తేదారు అనుమతులు లేకుండానే బండరాళ్లను తొలగించేందుకు పేలుళ్లకు పాల్పడ్డారు. కనీస రక్షణ చర్యలు పాటించలేదు.
పేలుళ్లకు సంబంధించి గుత్తేదారు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులు, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామస్థుల సమక్షంలో గ్రామసభ నిర్వహించి అనుమతి పొందాలి. నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లకు పాల్పడంతో గ్రామానికి చెందిన సాయి చరణ్ దుర్మరణం పాలయ్యాడు. మరికొంత మంది గ్రామస్థులు అదృష్టవశాత్తు ముప్పు నుంచి తప్పించుకున్నారు. ఇళ్లు, వాహనాలపై బండరాళ్లు పడటంతో గ్రామస్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పేలుళ్లకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. పేలుళ్లు జరపడానికి జిల్లా పాలనాధికారి స్థాయిలో అనుమతులు అవసరం తీసుకోవాలి.కానీ నిబంధనలు పాటించలేదు. బీంసారిలో చేపట్టిన పేలుళ్లకు సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గ్రామీణ ఎస్సై హరిబాబు తెలిపారు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు.
జాగ్రత్తలు చెప్పిన యువకుడే బలి
అమ్మకు తలనొప్పిగా ఉందని మాత్రల కోసం వెళ్లాడు. ఎదురుగా కన్పించిన వారికి ఇళ్లలోకి వెళ్లాలని చెప్పాడు. కానీ... పేలుళ్లకు వచ్చిన బండరాయి ధాటికి ఆ యువకుడే బలయ్యాడు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బీంసారిలో చెక్‌డ్యాం నిర్మాణ పనుల్లో జిలెటిన్ స్టిక్‌తో రాళ్లను పేల్చడంతో ఓ బండ నక్క సాయిచరణ్(24)పై పడటంతో మంగళవారం మధ్యాహ్నం మృతిచెందారు. బండరాళ్లను పేల్చుతున్నామని గ్రామస్థులు ఎవరు బయటకు రావొద్దని దండోరా వేయించారు. కానీ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా బండరాళ్లు ఇళ్లు, ద్విచక్రవాహనాలు, రహదారులపై పడ్డాయి. ఆ సమయంలో వెళ్లిన సాయి చరణ్ తలకు బలంగా రాయి తగిలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రిమ్స్‌కు తరలించారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు శ్యాంరావు-అరుణలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.