ఆదిలాబాద్ జిల్లాలో అటవీ, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపంతో అటవీభూమి అన్యాక్రాంతమవుతోంది. బోథ్ అటవీ రేంజ్ పరిధిలోనే దాదాపుగా 150 ఎకరాలు కబ్జా అయినట్లు ప్రాథమికంగా తేలింది. బోథ్ అటవీ రేంజ్ పరిధిలో దాదాపుగా 46 వేల 340 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో 2005లో అప్పటి ప్రభుత్వం 1150 మంది రైతులకు 2,800 ఎకరాలకు సంబంధించి అటవీ హక్కుపత్రాలను జారీచేసింది. మిగిలిన 43,540 ఎకరాల్లో అటవీ సంపద ఉంది. దశాబ్ద కాలం నుంచి అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపం అటవీ భూముల అన్యాక్రాంతానికి కారణమవుతున్నాయి.
150 ఎకరాలు..
ఇటీవల అటవీ భూముల్లో సాగుచేస్తున్న ఒకరిద్దరు రైతులను అడ్డుకోగా... రెవెన్యూ అధికారులు జారీచేసిన అక్రమ పట్టాలు బయటపడ్డాయి. ప్రధానంగా కుచులాపూర్, ధనోర, గొల్లాపూర్, మర్లపల్లి, జీడిపల్లి, పిప్పల్‌ధరి, అందూర్ అటవీ కంపార్ట్‌మెంట్లలో దాదాపుగా 150 ఎకరాల అన్యాక్రాంతమైనట్లు ప్రాథమికంగా తేలింది.
నిబంధనల ప్రకారమైతే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తప్పా... అటవీ భూముల్లో పట్టాలు జారీచేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉండదు. గతంలో తహసీల్దార్లుగా పనిచేసిన ఒకరిద్దరు అధికారులు, మరికొంత మంది అటవీశాఖ అధికారులు పట్టాలు జారీ చేసినట్లు వెల్లడయింది. అక్రమ పట్టాల జారీ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇవీచూడండి: దేశ ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్రవాటా... నివేదిక విడుదల చేసిన కేటీఆర్