Heavy rains in adilabad district: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షం వీడటం లేదు. కొన్ని మండలాల్లో వరద ఉద్ధృతికి రోడ్లు, కల్వర్టులు దెబ్బతినడంతో జనం గ్రామాలకే పరిమితమయ్యారు. ఏకధాటిగా కురుస్తుండటంతో పొలం పనులు సాగడం లేదు. జిల్లాలోని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా సరిహద్దులోని పెన్‌గంగ పరవళ్లు తొక్కుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలకు నష్టం జరిగింది. వాతావరణ శాఖ జిల్లాను రెడ్ అలర్ట్‌గా ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలాల వారీగా లోతట్టు ప్రాంతాలను గుర్తించారు.
జిల్లాలో పల్లె, పట్టణమనే తేడాలేకుండా అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. అత్యధికంగా కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలో 16.45 సెం.మి., నిర్మల్ జిల్లా మామడ మండలంలో 16.24.సెం.మి. వర్షపాతం నమోదైంది. కుమురంభీం జిల్లాలో దాదాపుగా 9వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారయంత్రాంగం ప్రాథమికంగా తేల్చింది. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ సమీపంలోని నాగాపూర్ వంతెనపై వరదపొంగిపొర్లడంతో ఆదిలాబాద్- మంచిర్యాల మార్గంలో రవాణా స్థంభించింది. ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణిని ప్రసవం కోసం ఆదిలాబాద్‌కు తరలిస్తున్న మార్గమధ్యలో వాగుపొంగిపొర్లడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దాంతో తాళ్లసాయంతో వాహనాన్ని ఆమెను బయటకు దాటించి అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించాల్సి వచ్చింది. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటీ ప్రాంతాల్లోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు వెలికితీతకు అయిదు రోజులుగా అంతరాయం ఏర్పడింది.
ఇచ్చోడ లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు వరద నీరు రావడంతో విద్యార్థులను స్థానిక వైటీసీ భవనంకు మార్చారు. ఇచ్చోడ, సిరికొండ వెళ్లే దారిలో నీరు ఉద్ధృతంగా పారడంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ మండలంలో 6 గ్రామాలకు , నెరడిగొండ లో 16 గ్రామాలకు, సిరికొండ మండలంలో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వరదల వల్ల 'నిర్మల్ - మంచిర్యాల' ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూ సాంగ్వి వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైంది. విషయం తెలిసిన వెంటనే.. ఈ ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసి దారి మళ్ళించాలని అధికారులను ఆదేశించారు. ఈ రహదారి గుండా ప్రయాణించే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మంత్రి సూచించారు.
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారయంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జలాశయాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఏజెన్సీలో గర్భిణిల వివరాలను ముందుగానే సేకరించి.... మైదానప్రాంతాలకు తరలించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.