దండారి సంబరాలతో ఐకమత్యం.. పొరుగు వారితో బంధుత్వాలు పెరుగుతాయని ఎంపీ సోయం బాబూరావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం టక్కు గూడలో ఆదివాసీలకు అత్యంత పవిత్రమైన పండుగైన దండారి సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. స్థానికులు ఎంపీకి ఘన స్వాగతం పలికి.. సన్మానించారు. అనంతరం సోయం జెండాను ఆవిష్కరించి సామాగ్రికి పూజలు చేశారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ రానున్న తరాలవారికి అందించాలని కోరారు. ఈ ఉత్సవాల్లో యువత పాల్గొనేలా చూడాలని సూచించారు.
రోడ్డు, వంతెనతో పాటు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పలు సమస్యలను బాబూరావుకు విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం రూ.863 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. త్వరలోనే రోడ్డు, నీటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లంబాడాలను ఎస్.టి జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం ఆపేది లేదన్నారు. ఏజెన్సీలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ఛలో కలెక్టరేట్.. ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేతల ధర్నా