కొవిడ్-19 రాష్ట్రాన్ని వణికిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి సర్కార్ లాక్డౌన్ విధించింది. వివిధ రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. వారికి భోజనం అందించేందుకు చావరా అకాడమీ ముందుకు వచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి, అకాడమీ ప్రతినిధులు జిన్స్ థామస్, రాబర్ట్‌పవార్, జోయల్ సురేందర్ వారికి పది క్వింటాళ్ల బియ్యం, 5 వంటనూనె డబ్బాలు, రెండు క్వింటాళ్ల కందిపప్పును అందజేశారు.
జైనథ్ మండలం గూడలో తెరాస నేతలు జోగు పౌండేషన్ తరఫున పేదలకు రూ.15 వేలు నగదు పంపిణీ చేశారు. దంతనపల్లి, నర్సాపూర్ గ్రామాల్లోని వలస కూలీలకు సీఐ నరేష్‌కుమార్, కపాడ్స్ సంస్థ డైరెక్టర్ అమృత్‌రావ్, అమ్మ చారిటబుల్ ట్రస్టు, హస్నాపూర్‌కు చెందిన ఇమ్రాన్ సరకులు, కూరగాయలు ఇంటింటికి వెళ్లి అందించారు.
నార్నూర్‌లో నిరుపేద కుటుంబాలకు జైభారత్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూరగాయలను అందజేశారు. పట్టణంలో నిరుపేదలకు ఏఏస్‌కే ఫౌండేషన్ ఛైర్మన్ సాజిద్‌ఖాన్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో మావలలో నిత్యావసర సరకులు అందజేశారు.
తలమడుగులో పేద కుటుంబాలకు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేపట్టారు. సంత్ శ్రీ నారాయణబాబా దివ్య ఆశీస్సులతో మానవసేవ దేవుని సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను 150మందికి పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ అందజేశారు. బోథ్‌లో మహారాష్ట్రకు చెందిన వలస కూలీలకు రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు.
పొచ్చెర గ్రామంలో మదర్స్ డ్రిమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. తాంసి మండలం కప్పర్లకు చెందిన భాజపా నాయకులు పడాల పొచ్చన్న, రాములు , రవీందర్ మంగళవారం 25 మంది పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 500 నగదు, 5 కిలోల బియ్యం అందించారు. రవీంద్రనగర్‌కు చెందిన రవీందర్‌గౌడ్ తన మిత్రబృందంతో కలిసి మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. సాయినగర్‌లోని పేదలకు నాలుగున్నర క్వింటాళ్ల కూరగాయలను పంపిణీ చేశారు.