ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దస్నాపూర్ శివారులో సర్వేనంబర్ 21/1/ఏ, 21/1/డీలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1954 నుంచి అందుబాటులో ఉన్న పహానీ, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే.... ఇప్పటివరకు పడావు భూమిగానే ఉంది. వాస్తవానికి 21/1 సర్వేనెంబర్‌లో మొత్తం 146 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఆ తర్వాత జనావాస ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. ప్రస్తుతం రెండు సర్వే నంబర్లలో కలిసి మొత్తం 20 ఎకరాల భూమి మాత్రమే ఉంది.
ఆ భూమిని ప్రభుత్వం తమ పూర్వీకులకు కేటాయించిందని... తామే వారసులమంటూ 1994లో ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. 2005లో హద్దులు గుర్తించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే ఏడాది అప్పటి అధికారులు... ఆ భూమికి వారసులెవరూలేరని కోర్టుకు అప్పీలు చేశారు. 20 ఎకరాల భూమిని యథావిథిగా ఉంచాలని 2005లోనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అప్పటి నుంచి ఆ స్థలం పడావుగానే ఉంది. కానీ మే నెల 28, 31 తేదీల్లో కొంతమంది అక్రమంగా ఆ భూమికి కంచె చేయడమే కాకుండా.... ట్రాక్టర్లతో దున్నే ప్రయత్నం చేయడం వివాదస్పదమైంది.
ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఎకరా భూమి 5 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన 20 ఎకరాలకు 100 కోట్లు వస్తుండటంతో.... ఆ భూమిపై కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల కన్నుపడింది. కొంతమంది అధికారుల అండదండలతో... భూమి కాజేయాలనే ప్రయత్నం చేస్తుండటం వివాదస్పదమవుతోంది. అయితే.... రెవెన్యూ రికార్డుల ప్రకారం 20 ఎకరాలను ఎవరికీ కేటాయించలేదని అధికారులు తెలిపారు. అన్యాక్రాంతం కానీయకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారసులమని పేర్కొంటున్న వ్యక్తులెవరిదగ్గరా.... ప్రభుత్వం భూమి కేటాయించినట్లు పత్రాలేవీ లేవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Vaccination: వ్యాక్సినేషన్లో రికార్డు- ఒక్కరోజే 80 లక్షల డోసులు