పట్టణ ప్రగతిలో భాగంగా ఆదిలాబాద్ పురపాలికకు ప్రతి నెలా రూ.1.29 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ నెలకు సంబంధించి రూ.5.16 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా స్థాయి కమిటీ అనుమతి తీసుకొని పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
ఈ కమిటీతో పాటు టెలీ కాన్ఫరెన్సు ద్వారా కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకునేందుకు అధికారులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనులు పునఃప్రారంభం కానుండటంతో పట్టణంలో అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రజలకు మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి.
పట్టణంలోని వార్డులు 49
పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించిన పనులు 1651
నిర్మించాల్సిన దహన వాటికలు 3
శ్మశాన వాటికలు 2
అవసరమైన పార్కులు, ఆటస్థలాలు 24
ఆటో స్టాండులు 8
ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం 28
సమీకృత మార్కెట్ నిర్మాణం 1
ఈ పనులు చేపడతారు..
పురపాలక పరిధిలో ఫిబ్రవరిలో నెలరోజుల పాటు చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా అనేక సమస్యలు గుర్తించారు. కొన్ని అప్పటికప్పుడే పరిష్కరించగా.. నిధులతో అవసరమయ్యే వాటిని నమోదు చేసుకున్నారు. వీటి నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులు అందజేస్తోంది.
ఇందులో భాగంగా రాబోయే వర్షాకాలం కంటే ముందుగా నర్సరీలను సిద్ధం చేయడం, వైకుంఠధామాల నిర్మాణం, సమీకృత మార్కెట్ యార్డు ఏర్పాటు, ప్రజా మరుగుదొడ్లు, ఆటోస్టాండులు, డంపింగ్‌యార్డులకు స్థలాలు సమకూర్చడం, వ్యర్థాల నిర్వహణ ప్లాంటు ఏర్పాటు, వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా జోన్, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, చెత్త నుంచి వివిధ వస్తువులు తయారుచేయడం తదితర పనులను చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.
అధికార యంత్రాంగం ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు వచ్చాయని.. జిల్లాస్థాయి కమిటీతో పాటు కౌన్సిల్ ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ మారుతి ప్రసాద్ పేర్కొన్నారు.