ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ భాజపా ధర్నా చేపట్టింది. కొవిడ్ నిబంధనలకు లోబడి కొందరు జొన్న రైతులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్.. తన ఇంటివద్దనే ఆందోళన చేపట్టారు. జిల్లాలో 80వేల ఎకరాల్లో రైతులు జొన్నలు సాగు చేశారని శంకర్ తెలిపారు. కొనుగోళ్లకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో.. చేతికొచ్చిన 4లక్షల క్వింటాళ్ల జొన్నలను రైతులు ఇంటివద్దనే ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఆందోళన చేయాల్సి వస్తోందని పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఇప్పటికీ కొనుగోళ్లకు ముందుకు రాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనను పోలీసుల అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులకు న్యాయం చేయకపోతే పోలీసులు అడ్డుకున్నా రోడ్ల పైకి వచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నిబంధనలు కఠినంగా పాటించి కరోనాపై విజయం సాధించాలి: సీపీ