Broccoli farming: కొత్తరకం పంటల సాగు పట్ల ఆసక్తి ఉన్న ఈ రైతు పేరు... ఉమర్ అక్తర్. ఆదిలాబాద్ జిల్లా తంతోలికి చెందిన ఆయన.... యూట్యూబ్‌లో బ్రకోలి పంట విశేషాలను తెలుసుకుని సాగుచేయడం ప్రారంభించారు. గతేడాదిలో ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా పంట సాగు చేసిన అక్తర్ విదేశాలకు ఎగుమతి చేశారు. ఈసారి మరో ఎకరం విస్తీర్ణం పెంచి చేతికొచ్చిన దిగుబడులతో లాభాలు గడిస్తున్నారు. ఈసారి స్థానికంగానే బ్రకోలికి మంచి డిమాండ్ ఉండటంతో ఇక్కడే విక్రయిస్తున్నట్లు తెలిపారు.
adilabad farmer: ఆదిలాబాద్‌లోని రైతు బజార్‌లో బ్రకోలి విక్రయిస్తున్నారు. కిలో 100 రూపాయలకు అమ్ముతున్నా... కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే కూరగాయాలు... ప్రస్తుతం రైతుబజార్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రైతులు తమకున్న భూమిలో కొంతమేర కొత్తరకం పంటల వైపు మొగ్గుచూపితే లాభాలు పొందవచ్చని రైతు ఉమర్ అక్తర్ చెబుతున్నారు.
గతేడాది కూడా బ్రకోలి సాగు చేశాం. మంచి లాభాలు వచ్చాయి. అందుకే ఈ ఏడాది కూడా సాగు చేస్తున్నాం. దీనికి ఎక్కువగా ఫంగిసైడ్ మందులు వాడాలి. తెల్లగోబి కంటే ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఇది మామూలుగా పాలినేషన్లోనే పండుతుంది. మేం యూట్యూబ్‌లో చూసి సాగు చేసినాం. ఒపెన్ పాలినేషన్లో కూడా పంట వేయొచ్చు. గతేడాది సౌది అరేబియా, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేశాం. ఒక ఎకరాకు 100 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.50 వేల ఖర్చవుతుంది. ఈ పంటకు ఎక్కువ నీరు అవసరం లేదు. చలికాలంలో మంచుతోనే పంట పండుతుంది. ఈసారి ఇక్కడే మంచిధర ఉంది. అక్టోబర్‌లో పంట నాటుకుంటే డిసెంబర్లో కోతకు వస్తుంది. -ఉమర్ అక్తర్, రైతు, ఆదిలాబాద్‌జిల్లా
రైతు బజార్‌లో బ్రకోలి అనే కొత్త రకం వచ్చింది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే కూరగాయలు రైతుబజార్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్‌లో బ్రకోలి ప్రజలకు లభిస్తోంది. ఈ పంట వేసేలా రైతులను ప్రొత్సహించేలా వినియోగదారులు అండగా నిలబడాలి. బ్రకోలి ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నా.- శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి