Special Story on 1981 Indravelli Incident: ఉత్తర తెలంగాణలో వామపక్ష ఉద్యమాల్లో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉంది. పోరాటాల అనుభవాల్లోంచే ఇంద్రవెల్లి సభ పురుడుపోసుకుంది. పందొమ్మిదో దశకంలో బ్రిటీష్ పాలకులతో పాటు నైజాం ప్రభువు విధానాలను.. వ్యతిరేకించినందుకు రాంజీగోండ్ సహా వెయ్యి మందిని నిర్మల్ కేంద్రంగా మర్రిచెట్టుకు ఉరి తీయడంతోనే వెయ్యి ఉరుల మర్రి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. కానీ అక్కడితో పోరాటం ఆగిపోలేదు.
మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రకెక్కిన ఇంద్రవెల్లి: 1940 ప్రాంతంలో జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా కుమురంభీం జరిపిన ఆదివాసీ స్వయం ప్రతిపత్తి పోరాటం.. అజరామర కీర్తిని సంపాదించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నాయకత్వానికి ప్రత్యేక నినాదంగా నిలిచింది. తర్వాత 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లి వేదికగా.. భూమి, భుక్తి, విముక్తి పేరిట అప్పటి రైతు కూలీ సంఘం తలపెట్టిన సభ పోలీసు కాల్పులకు దారితీసింది. మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రకెక్కింది. ప్రతి నలభై ఏళ్లకోసారి జరిగిన పోరాటం వెనుక.. భూ సమస్యనే ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది.
ఐదేళ్ల కిందట ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగానే ఆదిలాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఆదివాసీ ఉద్యమం రాష్ట్ర సరిహద్దులు దాటి దిల్లీకి చేరింది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడుభూముల సమస్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలకు ఇంద్రవెల్లి పోరాటం ప్రేరణగా నిలుస్తోంది. గిరిజనులకు పోరుబాట చూపిస్తోంది.
'రాంజీ గోండు పోరాటానికి , కుమురం భీం పోరాటానికి 40 ఏళ్లు. కుమురం భీం పోరాటానికి ఇక్కడ ఇంద్రవెల్లి పోరాటానికి 40 సంవత్సరాలు. ఇలా 40 సంవత్సరాలకోసారి ఉద్రిక్తమైన పోరాటాలు జరిగినప్పటికీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షల సంఖ్యలో ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీలు ఈ భూమిని రక్తంతో తడుపుతున్నారు. కానీ వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. మా మనుగడ పూర్తిగా కోల్పోతున్నాం. పెసా చట్టం దుర్వినియోగం అయింది. మా హక్కులు కాపాడబడట్లేదు.. కాలరాయబడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి పోరాటం చేసి తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే ఆ అమరులకు ఇచ్చే నిజమైన నివాళి.'-సుగుణ, ఆదివాసీ మహిళా నేత
పెన్‌గంగా, ప్రాణహిత, పెద్దవాగు సహా గోదావరి నదుల ప్రవాహంతో ఇమిడి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.. సరైన నీటి వసతి లేక వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అపారమైన ఖనిజ, సున్నపురాయి, మాంగనీసు ఖనిజ సంపదలకు నిలయమైనప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో ముందడుగు పడటం లేదు. ఫలితంగా ఉద్యమాలకు ఆస్కారం ఏర్పడుతూనే ఉంది.
ఇవీ చదవండి: