Dogs chased a bear in Adilabad : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. వానాకాలం పంట వేయడానికి తెల్లవారుజామునే రైతులు, కూలీలు పొలాలకు చేరారు. ఈ క్రమంలో పంటచేల పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా పొలాల్లో ప్రత్యక్షమైంది. ఎలుగును చూసి రైతులు, కూలీలు పరుగులంకించారు.
గ్రామంలోకి పరుగు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా కలిసి ఎలుగుబంటి సంచరించే ప్రాంతానికి శునకాలతో వెళ్లారు. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంటిని శునకాల సాయంతో తరిమికొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఎలుగుబంటి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు.