తెలంగాణ కశ్మీరం ఆదిలాబాద్‌లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాలలో డెంగీ కేసులు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, దిలావర్‌పూర్, భైంసా, ఖానాపూర్ మండలాలు, కుమురంభీం జిల్లాలోని చింతలమానేపల్లి, జైనూర్, కౌటాల మండలాలతోపాటు మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆసుపత్రులకు పరుగులు
ఆదిలాబాద్ రిమ్స్‌తోపాటు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిమినహా మిగిలిన కుమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో డెంగీ నిర్ధారణలో కీలకమైన ఎలిసా పరీక్ష కేంద్రాలు లేవు. కేవలం ర్యాపిడ్ డయాగ్నిక్ స్టిక్ పరీక్షలకే పరిమితం కావాల్సి వస్తోంది. వ్యాధి తీవ్రత పెరిగి రోగులు ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది.
వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది
ఉట్నూర్ ఏజెన్సీలో వ్యాధి తీవ్రత మరింత ఆందోళన కలిగిస్తోంది. సరైన రవాణా సౌకర్యాల్లేక రోగులు సకాలంలో ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారుతోంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వైద్యసేవలకు అవరోధంగా తయారవుతోంది. అరకొర సేవలతో ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సివస్తోందని జ్వరపీడితులు వాపోతున్నారు.