ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోని కరోనా బాధితులకు నిర్ధరణ పరీక్షలు చేయటానికి ఆదిలాబాద్ రిమ్స్‌లో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది వరకు నమూనాలను హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. నివేదికలు రావటానికి రెండు రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం కేంద్రం ఏర్పాటుతో అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. రిమ్స్‌లో అనుమానితుల నమూనాలను సీబీనాట్, ట్రూనాట్ యంత్రాలపై చేయనున్నారు. రోజూ దాదాపు వంద నమూనాలను పరీక్షించటానికి వీలవుతుంది.
వైద్య బృందం సూచిస్తేనే పరీక్షలు
కరోనా లక్షణాలున్న వారిని మొదట వైద్య బృందం పరీక్షించి నిర్ధరణ పరీక్షలకు రెఫర్ చేయాలి. వైద్యారోగ్య శాఖ వైద్యులు సూచించాలి. ఇలాంటి వారికి పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వస్తే మొదట వైద్యులు సాధారణ పరీక్షలు చేస్తారు. ఇందులో కరోనా వైరస్ సోకినట్లు అనుమానించినప్పుడే వారికి పరీక్షలు చేయటానికి వైద్యులు సూచిస్తారు.
గర్భిణుల నమూనాల సేకరణ
ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కంటెయిన్‌మెంట్ ప్రాంతంలోని ఏడుగురు గర్భిణుల నమూనాలను ఆదివారం సేకరించారు. ఈ నెలలో ప్రసవం కావలసి ఉన్న కంటెయిన్‌మెంట్ ప్రాంతంలోని గర్భిణులకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాల్సి ఉండటంతో వీరి నమూనాలను సేకరించి రిమ్స్ కోవిడ్ ల్యాబ్‌కు పంపించారు. మంచిర్యాలలో క్వారంటైన్‌లో ఉన్న పదకొండు మంది నమూనాలను సేకరించారు. ఆ నమూనాలు ఆదిలాబాద్ ల్యాబ్‌కు రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నమూనాల నిర్ధరణ పరీక్షల అనంతరం సోమవారం నాటికి నివేదికలు అందనున్నాయి.
హైదరాబాద్ నుంచే కొవిడ్ ఫలితాల వెల్లడి
రిమ్స్‌లో పరీక్షలు చేసి పాజిటివ్, నెగెటివ్ నివేదికలను హైదరాబాద్‌లో ఉన్నతాధికారులకు నివేదిస్తామని రిమ్స్ సంచాలకుడు బానోత్ బలరాంనాయక్ తెలిపారు. అధికారులు అక్కడి నుంచే నివేదికలను వెల్లడిస్తారన్నారు.