ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ నుంచి మొత్తం 21 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. ఇందులో ఇప్పటివరకు 15 మంది వైరస్ నుంచి విముక్తి పొంది ఇళ్లకు చేరారు. తాజాగా మరో ఇద్దరు ఆదివారం వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌ను జయించిన వారి సంఖ్య పదిహేడుకు చేరింది. మిగిలిన నలుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు డిశ్ఛార్జి అయితే ఆదిలాబాద్ కరోనా రహిత జిల్లాగా మారుతుంది.
వృద్ధులు, చిన్నారి సైతం...
జిల్లాలో కోవిడ్ బారినపడి కోలుకున్న వారిలో వయోవృద్ధులతో పాటు అయిదేళ్ల చిన్నారి ఉంది. 80 సంవత్సరాల వయసు ఉన్న వయోవృద్ధురాలు, 72 సంవత్సరాల వయసున్న ఇద్దరు వృద్ధులు, 62, 57 సంవత్సరాల వయసున్న మరో ఇద్దరు వృద్ధులు కోలుకున్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారి వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరింది.
పట్టణవాసులే అధికం
కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో పట్టణ వాసులే ఎక్కువ మంది ఉన్నారు. నేరడిగొండకు చెందిన ముగ్గురు, ఉట్నూర్ మండలం హస్నాపూర్‌కు చెందిన ఒకరు, ఆదిలాబాద్ శివారు ప్రాంతంలోని బెల్లూరికి చెందిన ఒకరు ఉన్నారు. మిగిలిన పదహారు మంది ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్, ఖానాపూర్, ఖిలా, చిలుకూరిలక్ష్మీనగర్, శివాజీకూడలి ప్రాంతవాసులు.
సకాలంలో వైద్యం అందటం వల్లే
బాధితులను సకాలంలో గాంధీ ఆసుపత్రికి పంపించి వైద్యసేవలు అందించటంతోనే కోలుకున్నారు. వారిలో ఉన్న రోగ నిరోధక శక్తి, ప్రణాళికాబద్ధ వైద్యం, భోజన సదుపాయాలతో త్వరితగతిన మహమ్మారి నుంచి బయటపడ్డారు.
- తొడ్సం చందు, జిల్లా వైద్యారోగ్యాధికారి