ఆదిలాబాద్ రిమ్స్‌లోనూ కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. క్షయ నిర్ధరణ పరీక్షలు చేయడానికి కుమురంభీం, హుజూరాబాద్, పెద్దపల్లి జిల్లాలకు సరఫరా చేసిన ట్రూనాట్ యంత్రాలను అధికారులు రిమ్స్‌కు తరలించారు. ఈ పరీక్షలు చేయడానికి అవసరమైన జెనెక్స్‌పెర్ట్ కిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది.
క్షయ నిర్ధరణ పరీక్షలు చేసే రిమ్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్న సీబీనాట్ యంత్రం ఉన్న ల్యాబ్ వద్దనే కరోనా నిర్ధరణ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వారంలోపే ఈ ల్యాబ్ పనిచేసేలా ప్రత్యేక నిపుణులు యంత్రాల బిగింపు కార్యక్రమం చేపట్టారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేకాధికారులుగా డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ అనిల్ బుధవారం ల్యాబ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ల్యాబ్‌లో పని చేయడానికి ఇప్పటికే జిల్లా వైద్యారోగ్య శాఖ ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్లను రిమ్స్‌కు కేటాయించింది. మరో నాలుగైదు రోజుల్లో ల్యాబ్‌లో పరీక్షలు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రిమ్స్‌కు తీసుకువచ్చిన ట్రూనాట్ యంత్రం
నాలుగు జిల్లాలకు ఉపయోగం..
ఆదిలాబాద్‌లో ఈ నిర్ధరణ కేంద్రం ఏర్పాటు వల్ల ఉమ్మడి జిల్లాలోని నిర్మల్ మినహా ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు రోజుల కిందట ఇక్కడి సిబ్బందికి నిర్ధరణ పరీక్షలు చేయడానికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు. మరో రెండు రోజుల అనంతరం ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రస్తుతం అనుమానితులకు ఈ పరీక్షలు చేయడానికి నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. అక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన నమూనాల సంఖ్య అధికంగా ఉండటం వల్ల నివేదికలు రావడంలో జాప్యం చోటుచేసుకుంటోంది. త్వరలో ఈ సమస్య పరిష్కారం కానుంది.
కొవిడ్-19 నిర్ధరణ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న రిమ్స్ సంచాలకుడు బానోత్ బలరాంనాయక్, వైద్యులు
ప్రభుత్వం సరఫరా చేసిన కరోనా నిర్ధరణ కిట్లు