కొవిడ్-19 నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. జిల్లాల పునర్విభజన తరువాత అధికార వికేంద్రీకరణ జరిగినప్పటికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో వైద్యశాఖ అంటిముట్టనట్లే వ్యవహరిస్తోంది. కరోనా మహమ్మారిని సాదాసీదాగానే పరిగణిస్తోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం పాజిటివ్ కేసులు 989 నమోదైతే ఇప్పటిదాకా 414 మందికి వ్యాధి నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇంకా 564 మంది యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో 13 మంది మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో కనీస వివరాలు సైతం వైద్యశాఖ వద్ద లేకపోవడం గమనార్హం.
వ్యాధిగ్రస్థుల వివరాలన్నీ పీహెచ్‌సీల నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకే పంపిస్తుండటంతో మాకు ఎలాంటి వివరాలు తెలియడం లేదని స్వయంగా నిర్మల్ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.వసంత్‌రావు పేర్కొంటున్నారు. వ్యాధిగ్రస్థుల్లో మనోధైర్యం నింపాల్సిన కీలకసమయంలో వైద్యశాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మినహా మిగిలిన ప్రాంతాల్లో బాధితులకు కనీసం కరోనా కిట్లు కూడా అందించడం లేదు.
హరితహారానికిస్తున్న ప్రాధాన్యం.. కరోనా కట్టడికి లేదు..
మార్చి నెలలో లాక్‌డౌన్ ప్రారంభంలో అధికారులు ప్రదర్శించిన హడావుడి ఇప్పుడు లేదు. ఇతర జిల్లాల్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి సహా ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తుంటే ఉమ్మడి జిల్లాలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు హరితహారం, ఇతర కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యం కరోనా మహామ్మారి నియంత్రణపై దృష్టి సారించడంలేదు. వ్యాధిబారిన పడుతున్న వారెవరో, ఆసుపత్రుల్లో, ఇంటివద్ద ఉంటున్న వారెవరో, అందుతున్న వైద్యం ఎలా ఉందో అనేదానిపై జవాబుదారీతనం లోపించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పల్లె ప్రజానీకం చూపిస్తున్న శ్రద్ధ పట్టణ ప్రాంతాల్లో కనిపించడం లేదు. భౌతిక దూరం పాటించాలనే నిబంధన పూర్తిగా పట్టుతప్పింది. ఐసోలేషన్ కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ అస్తవస్తంగా మారింది.
9 మంది కరోనా బాధితుల పరారీ..
ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్‌లో 200 పడకలతో ఏర్పాటుచేసిన కొవిడ్ ఐసోలేషన్, ఐసీయూ, క్వారంటైన్‌లో చేరిన తొమ్మిది మంది శనివారం సాయంత్రం పరారీ కావడం అధికారుల మధ్య ఉన్న సమన్వయలోపాన్ని వెల్లడిస్తోంది. ఆసిఫాబాద్‌లో 60 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయగా 40 పడకలతో గోలేటిలో, 50 పడకలతో కాగజ్‌నగర్ పోస్టుమెట్రిక్ వసతిగృహం, 89 పడకలతో వాంకిడి ఆశ్రమ పాఠశాల, 30 పడకలతో జైనూర్ మండలం రాసిమెట్టలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ వ్యాదిగ్రస్థుల సంఖ్య తక్కువే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 150 పడకలతో ఐసోలేషన్, మరో 20 పడకలతో ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోనే వ్యాధిగ్రస్థులకు సేవలందిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. ఇక నిర్మల్ జిల్లా నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రిలో 20, భైంసాలో 15 పడకలు ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వానికి నివేదికలను పంపడంతోనే సరిపోయింది. బాధితుల గోడు వినేవారే లేరు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యాధిబారినపడినవారి వివరాలు కొంతవరకు వెల్లడవుతుంటే మిగిలిన మూడు జిల్లాలో వాటి వివరాలు కూడా అందుబాటులో లేవు.
భరోసానివ్వాలి...
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారికి భరోసా ఇవ్వాల్సి ఉంది. వైద్యశాఖ వర్గాలతోపాటు జిల్లా ఆసుపత్రుల మధ్య సమన్వయం చేయాలి. అధికార వికేంద్రీకరణ చేస్తూ కీలకమైన వైద్యులకు బాధ్యతలను అప్పగించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, పాలనాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమన్వయం చేస్తేనే కరోనా మహమ్మారిని నియంత్రించడం వీలవుతుంది.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్