ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అధికార తెరాస వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జీ జి.నిరంజన్ తెలిపారు. తాము ముందు నుంచి అనుకున్న విధంగానే అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.
బలవంతంగా ఉపసంహరణ చేయించారు...
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 34వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన ధర్మాగౌడ్‌ను బలవంతంగా ఉపసంహరణ చేయించారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగురామన్న పథకం ప్రకారం తన కొడుకు జోగు ప్రేమేందర్‌ను బరిలోకి దించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లేకుండా చేశారని విమర్శించారు. అది కూడా పోలీసుల ముందే బలవంతంగా విత్‌డ్రా చేయించినట్లు ఆరోపించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.
అసదుద్దీన్‌పై కేసు నమోదు చేయాలి...
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బు తీసుకుని తమకు ఓటెయ్యాలని అసదుద్దీన్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయనకు నోటీసు ఇవ్వాలని కోరామని... కేజ్రీవాల్ కూడా గతంలో ఇలాగే వ్యవహరించారని నోటీసు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి నోటీసు ఇచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశామన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కొల్లాపూర్‌లో నేతల మధ్యే కొట్లాట... మరి గెలిచేదెవరో...?