జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్ పట్టణ శివారులో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కేంద్ర పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు స్థిరాస్తి వ్యాపారులకు వరంలా మారాయి. మావల మండల పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని మావల, బట్టి సావర్గం శివారులో వందలాది ఎకరాల్లో ప్రభుత్వ భూమి విస్తరించి ఉంది. వీటి పక్కనే పట్టా భూములున్నందున.. ఈ భూములను ఆక్రమించుకుని దందా కొనసాగిస్తున్నారు.
ఇది గ్రహించిన పాలనాధికారి దివ్య దేవరజన్ ప్రభుత్వ భూముల్లో క్రయవిక్రయాలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అక్రమ లేఅవుట్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న దందాను నిలిపివేస్తూ చర్యలు తీసుకున్నారు. అనుమతి లేని ప్లాట్లను విక్రయించరాదని ఆ భూముల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి హద్దు రాళ్లను తొలగించారు.
మరోవైపు ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా కలెక్టర్ చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ భూములు, నిషేధిత భూముల జాబితాను ప్రజలకు తెలిసేలా రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఒక్క లేఖాస్త్రం బ్రహ్మాస్త్రంగా మారి వేయి ఎకరాలకు రక్షణ గోడగా మారింది. ఆ లేఖే స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు ముకుతాడులా మారింది.
ఇదీ చదవండిః చెక్‌డ్యామ్ నిర్మాణంతో పెరగనున్న భూగర్భజలాలు