రాష్ట్రంలో పత్తి పంటకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి చెందింది. గత రెండు ఖరీఫ్ సీజన్లలో జిల్లాలోని 80 వేల 460 మంది రైతులు... 2.57లక్షల ఎకరాల పంటకు బీమా చేశారు. ఎకరాకు 17 వందల 50 రూపాయల ప్రీమియం చొప్పున 44 కోట్ల 99 లక్షల రూపాయలు బీమా కంపెనీలకు చెల్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా 80 కోట్ల 37 లక్షల రూపాయల చొప్పున మొత్తం 160 కోట్ల 74 లక్షలు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లు గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడం వల్ల బీమా కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన 269 కోట్ల పంట నష్టపరిహారం పంపిణీలో ప్రతిష్టంభన నెలకొంది. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనిష్ఠ ఉష్ణోగ్రతలతో కూడిన అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు పంటల బీమా చేసుకున్న రైతులకు... నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలకు పడిపోవడంతోపాటు 2018 నుంచి 2020 మధ్య కాలంలో పంటలు నష్టపోయినట్లుగా అధికార యంత్రాంగం నిర్ధరిచింది. పరిహారం రాకపోవటంతో ఇటీవల జిల్లాకు చెందిన రైతు భూమారెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా బీమా కంపెనీలను వివరాలు కోరగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా చెల్లించలేదనే విషయం వెల్లడైంది. రైతు సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జాప్యం కావడం వల్లే
మండలాలవారీగా బీమా ప్రీమియం చెల్లించిన రైతుల జాబితాను ఇప్పటికే వ్యవసాయశాఖ సిద్ధం చేయడమే కాకుండా ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రీమియం చెల్లింపు విషయంలో జాప్యం కావడం వల్ల రైతులు ఎదురుచూడక తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా చెల్లిస్తే రైతులకు మేలు చేకూరే అవకాశం ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదంవడి: హేమంత్ హత్యకేసు: రెండోరోజు విచారణలో కీలక విషయాలు..!