Bhoraj Check Post Controversy in Adilabad : ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య వ్యాపార, వాణిజ్య పరంగా భోరజ్ తనిఖీ కేంద్రం వారధిగా నిలుస్తోంది. ఉత్తరాది నుంచి వ్యాపార వస్తువులు, సరకులు, ఇతరత్రా సామాగ్రి తెలంగాణలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని భోరజ్ కేంద్రంలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎంవీఐలులు, ఎఎంవీఐలు కలిపి ఒక్కో షిప్టులో ఐదుగురు చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో 15 మంది విధులు నిర్వహిస్తారు. సరిపడేంత సిబ్బంది లేనందున ఆ శాఖలోని యంత్రాంగం మంచిర్యాల, జగిత్యాలకు చెందిన కొంతమంది మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.
రోజుకి రూ.10లక్షలు ఆదాయం వస్తుంది: వారిలో రాజకీయ పరపతి కలిగిన ఒకరిద్దరు సీనియర్ ఎంవీఐలు అన్ని షిఫ్టుల్లో తామే విధులు నిర్వహిస్తామని ఆసక్తిచూపడమే కాకుండా.. మిగిలిన వారిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం వివాదస్పదమవుతోంది. భోరజ్ తనిఖీ కేంద్రంలో అధికారులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తే ప్రభుత్వానికి రోజుకు రూ.10లక్షల చొప్పున నెలకు 3కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి చెందాల్సిన ఆ ఆదాయాన్ని దండుకునేందకు ఒకరిద్దరు సీనియర్లతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఓ అధికారి వ్యూహాత్మకంగా విధుల కోసం ముందుకు రావడం ఘర్షణలకు దారితీస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి: ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లినా.. పట్టించుకోకపోవడంతో ఇటీవల కొంతమంది జూనియర్ ఎఎంవీఐలు పెట్రోల్ డబ్బాలతో విధులకు హాజరుకావడం చర్చనీయాంశమైంది. విషయం తెలిసిన తనిఖీ కేంద్రం ఇన్‌ఛార్జ్ వెంటనే మంటలను ఆర్పే ఫైర్ పరికరాలను తెప్పించడమే కాకుండా అప్పటికప్పుడు ఏంచేయాలనే దానిపై సిబ్బందికి తర్ఫీదు ఇప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దండుకోవాలనే కొందరు సీనియర్ల ధోరణితో.. భోరజ్ తనిఖీ కేంద్రం వివాదాల్లో చిక్కుకుంటుంది.
అధికారుల ప్రోత్సాహంతోనే జరుగుతోందా: ఇన్ని జరుగుతున్నా అలాంటిదేం లేదు అంతా సజావుగానే సాగుతోందంటూ సదరు అధికారులు వివరించడం విస్మయానికి గురిచేస్తోంది. భోరజ్ తనిఖీ కేంద్రంలో అక్రమంగా వసూలు చేసే డబ్బుల్లో ఉన్నతాధికారులకూ పాత్ర ఉంటోందని పులువురు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే అనుకూలమైన సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు ఇన్‌ఛార్జ్‌లుగా పోస్టింగ్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
"అపోహాలు సృష్టిస్తున్నారు. ఇక్కడ వివాదాలేం జరగలేదు. ఫైనాన్సియల్ ఇయర్ క్లోజింగ్ రావడంతో ఎక్కువ సిబ్బంది అవసరం అవుతోంది. డ్యూటీ చార్ట్ ప్రకారమే ప్రతి ఉద్యోగి వచ్చి తన పని తాను చేసుకుంటున్నారు. ఇక్కడ గొడవలేం జరగట్లేదు." - శ్యాంనాయక్, సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్
ఇవీ చదవండి: