ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్‌గంగా నది సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పులులు పక్షం రోజుల్లోనే మూడు పశువులను హతమార్చడం కలకలం రేపుతోంది. రెండు రోజుల కిందట గొల్లఘాట్ అటవీ ప్రాంతంలో పులి దాడిలో ఆవు హతమైంది. అటువైపు ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
లేగదూడను లాక్కెళ్లి...
ఇటీవలే ఇందూర్‌పల్లి శివారులో ఆవుల మందలో లేగదూడను పులి లాక్కెళ్లి చంపింది. రెండు రోజుల తర్వాత తాంసికే అటవీ ప్రాంతంలో ఇంకో పులి ఆవును హత మార్చింది. అటవీశాఖ అధికారులు ఉపాధ్యాయులను జీపులో బడికి తీసుకెళ్లి, తీసుకొస్తున్నారు.
డ్రైవర్ కంట పడింది..
ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయం నుంచి తేరుకోకముందే.. తాంసికే శివారులో పులి రెండురోజుల క్రితం ఉదయం ఆర్టీసీ డ్రైవర్ కంట పడింది. ఈ విషయం దావానంలా వ్యాపించడం వల్ల అటువైపు వెళ్తున్న ప్రజలు మార్గ మధ్యలోనే తిరిగి వెళ్తున్నారు. అదే రోజు సాయంత్రం గొల్లఘాట్ గ్రామానికి కూతవేటు దూరం అటవీ ప్రాంతంలో ఆవును హతమార్చడం భయాందోళనకు దారి తీసింది.
పులి కదలికల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పులులు తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వస్తున్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడూ గస్తీ కాస్తున్నామని.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థులు అటవీ ప్రాంతం వైపు వెళ్లకుండా ఉండాలని అప్రమత్తం చేశారు. పులి జాడ కోసం గాలింపులు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి : ఎనిమిది నెలల గర్భవతి ఇంకొకరితో వెళ్లిపోయింది!