అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై ట్రాక్టర్ యజమాని అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చోటు చేసుకుంది. విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి అటవీశాఖ సిబ్బంది మండల పరిధిలోని తిమ్మాపూర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా తిమ్మాపూర్ నుంచి సిరికొండ వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను వారు ఆపారు.
అనుమతి లేకపోవడంతో ఇచ్చోడ అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళుతుండగా, సంబంధిత ట్రాక్టర్ యజమాని ఇమ్రాన్, మరో అయిదుగురు అనుచరులతో సుంకిడి గ్రామ సమీపంలో వారిని అడ్డుకున్నారు. నా ట్రాక్టర్‌ను ఎలా తీసుకెళ్తారో చూస్తామని.. ఇష్టారీతిన దూషించారు. మరోసారి అడ్డొస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈక్రమంలో ఇద్దరు వాచర్‌లు రవీందర్, ధర్మరాజ్‌లపై దాడి చేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన ట్రాక్టర్ యజమాని ఇమ్రాన్, తనకు సహకరించిన అయిదుగురు వ్యక్తులపై శనివారం సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.