వాహనాలకు కేటాయించే ఫ్యాన్సీ నంబర్లను సాధారణంగా ఆన్‌లైన్‌లో పెడతారు. వాహనదారులు నచ్చిన నంబరును వేలం ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువమంది ఇష్టపడే టీఎస్01ఈపీ-9999 నంబరును ఈనెల 5న ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆదిలాబాద్‌కు చెందిన శివప్రసాద్, మరో అయిదుగురు దాని కోసం దరఖాస్తు చేయబోతే ఎర్రర్ మేసేజ్ వచ్చింది. తర్వాత కాసేపటికి సైట్లోంచి పూర్తిగా మాయమైంది. మర్నాడు సెలవుదినం కావడంతో ఏడో తారీఖున దరఖాస్తు చేద్దామని చూస్తే దాన్ని ఎవరికో కేటాయించినట్లు ‘రిజర్వ్‌డ్’ అని కనిపిస్తోంది. దీంతో ఏదో మాయ జరిగిందని వారికి అర్థమైంది. హైదరాబాద్ కేంద్రంగానే ఈ నంబరును మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేలం వేస్తే రూ.లక్షల్లో ధర పలికే నంబరు ఎలాంటి పోటీ లేకుండా కేవలం ప్రభుత్వం నిర్ణయించిన రూ. 50 వేలు మాత్రం కట్టించుకుని తమకు కావలసినవారికి కేటాయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారమైతే దానిని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్‌లో ఉంచి దరఖాస్తుల్ని ఆహ్వానించాలి. ఎక్కువమంది పోటీపడితే మధ్యాహ్నం 2 - 4 గంటల మధ్య వేలం నిర్వహించాలి. ఎవరు ఎక్కువ ధర పెడితే వారికి కేటాయించాలనేది నిబంధన. అవేమీ లేకుండా అసలు ఆన్‌లైన్‌లోనే నంబరు కనిపించకుండా చేసేశారు. ఈ విషయమై రవాణాశాఖ ఉమ్మడి జిల్లా ఉపరవాణా అధికారి పుప్పాల శ్రీనివాస్‌ను సంప్రదించగా ఏం జరిగిందో తమకు తెలియదని అన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా సేవలు