మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నెలరోజుల పాటు కొనసాగిన పోషణ్ అభియాన్ కార్యక్రమ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ వేడుకలకు జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ హాజరయ్యారు. విధుల పట్ల అంకితభావం ప్రదర్శించి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలు, శిశువుల అభివృద్ధికి నిరంతరం కృషిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పోషణ విలువలపై విస్తృత ప్రచారం చేసిన ఐసీడీఎస్ అధికారులను, అంగన్‌వాడీ కార్యకర్తలను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. వారు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, ఇతరులూ వారిని ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలన్నారు. ఈ సందర్భంగా నెలరోజుల పాటు శాఖ తరపున నిర్వహించిన కార్యక్రమాల గురించి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మిల్కా వివరించారు. జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.