కరోనా బారిన పడి సింగపూర్‌లో ఆదిలాబాద్ జిల్లా కడెం మండలానికి చెందిన వలస కార్మికుడి మృతి ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. తన కూతురును ఒక్కసారైనా చూడకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడు వెళ్లిన 5 నెలలకే పాప పుట్టిందని, ఫోన్‌లో పాప ఫొటోలు చూసుకుంటూ మురిసిపోయేవాడని, వచ్చేటప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు తెస్తానని చెప్పాడని.. ఇప్పుడు మా కుటుంబానికి దిక్కు ఎవరని ఎలగడపకు చెందిన భూక్య తిరుపతి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. అంత్యక్రియలు అక్కడే..!
ఎలగడపకు చెందిన భుక్యా లక్ష్మణ్ నాయక్, కమలాబాయిలకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. చిన్న కుమారుడు పదేళ్లక్రితం మంచిర్యాలలో చదువుకునేటప్పుడు ప్రమాదవశాత్తు నీటికుండిలో పడి చనిపోయాడు. పెద్ద కుమారుడు తిరుపతి కుటుంబపోషణ కోసం ఏడాది క్రితమే సింగపూర్ వెళ్లాడు. అక్కడ కరోనాబారిన పడి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడని ఆదివారం సమాచారం రావడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. కొవిడ్‌తో మరణించడంతో అంత్యక్రియలు సైతం అక్కడే నిర్వహిస్తారని తెలిసి కడసారి చూపైనా దక్కదా..? అని తల్లిదండ్రులు, భార్య విలపిస్తున్నారు. కన్న కూతురును ఒకసారైనా చూసుకోకుండా వెళ్లిపోయాడంటూ బంధువులు కంటతడి పెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సోమవారం మృతుని తల్లిదండ్రులు భుక్యా లక్ష్మణ్‌నాయక్, కమలాబాయితోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి..
ఉపాధి కోసం అప్పులుచేసి సింగపూర్ దేశం వెళ్లి అక్కడే కరోనాబారిన పడి మరణించిన తిరుపతి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమసంఘం అధ్యక్షుడు రుద్ర శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.