ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్డా(neeraj chopra gold medal).. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం నెగ్గి భారతీయుల ముఖాల్లో ఆనందం నింపాడు. దీంతో ఈ 23 ఏళ్ల హరియాణా కుర్రాడిని యావత్ దేశ ప్రజలంతా ప్రశంసిస్తున్నారు.
అయితే నీరజ్ స్వర్ణ సంబరం మన 135 కోట్ల ప్రజలతో ఆగిపోలేదు. ఖండాంతరాలు దాటిపోయింది. జర్మనీలోని ప్రజలు కూడా అతడి విజయాన్ని ఆస్వాదిస్తూ ఓ పండగలా జరుపుకొన్నారు. అదేంటి మనం గోల్డ్ మెడల్ సాధిస్తే అక్కడి ప్రజలు ఆనందంతో పండగ చేసుకోవడమేంటి అని ఆలోచిస్తున్నారా? అవును మీరు చదివింది నిజమే..
కథేంటంటే?
నీరజ్ చోప్డా విజయం వెనుక అతడి కోచ్ డాక్టర్ క్లాస్ బార్టోనిట్జ్ కృషి ఎంతో ఉంది. ఆయన జర్మనీలోని ఓబర్ష్లెటన్బ్యాచ్(Oberschlettenbach) అనే చిన్న గ్రామంలో ఉంటారు. అందుకే చోప్డా ఆటను ఆ గ్రామ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఎప్పుడైతే చోప్డా స్వర్ణం సాధించాడో .. ఇక వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. బార్టోనిట్జ్ను ఫోన్లు, మెసేజ్ ద్వారా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. నాకెంతో సంతోషంగా ఉంది. నాకెప్పుడు ఇన్ని ప్రశంసలు అందలేదు. చాలా మంది అథ్లెట్లు, కోచ్‌లు కూడా ఫోన్ చేసి విషెస్ చెబుతున్నారు. నీరజ్ గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు" అని బార్టోనిట్జ్ అన్నారు.
అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్ పతకం సాధించి భారతీయుల 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు నీరజ్ చోప్డా. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ పలు రాష్ట్రప్రభుత్వాలు, దిగ్గజ కంపెనీలు భారీ నజరానాలు ప్రకటిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఒలింపిక్స్ కోసం ఇష్టమైన ఆహారానికి ఆర్నెళ్లు దూరం!