టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్‌కు మరో పతకం లభించింది. ఆదివారం జరిగిన డిస్కస్ త్రో ఎఫ్ 52 పోటీలో వినోద్ కుమార్(Vinod Kumar Discus throw) కాంస్యం సాధించాడు. వినోద్(41).. 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇక పోలాండ్‌కు చెందిన పీయోటర్ కోసెవిక్జ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా క్రోయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు.
బీఎస్ఎఫ్ ట్రైనింగ్‌లో ఉన్న సమయంలో వినోద్ కాళ్లకు గాయమైంది. దీంతో, పదేళ్లపాటు ఆయన మంచానికే పరిమితమయ్యాడు. ఈ సమయంలోనే ఆయన తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు. పతకంతో మెరిశాడు.
వినోద్(Vinod Kumar Paralympics) పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయన కుటుంబసభ్యులు. హరియాణా రోహ్తక్లోని తమ ఇంట్లో సంబరాలు చేసుకున్నారు.
"వినోద్ పతకం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. 10 నెలల నుంచి ఆయన తన పిల్లలకు దూరంగా ఉన్నాడు."
--అనిత, వినోద్ కుమార్ సతీమణి.
ప్రశంసల వెల్లువ..
కాంస్య పతక విజేత వినోద్ కుమార్‌ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. వినోద్ అద్భుత ప్రదర్శనకు భారత్ కృతజ్ఞతలు తెలుపుతోందని అన్నారు. ఆయన కృషి, సంకల్పం కారణంగా ఈ అద్భుతమైన ఫలితం వచ్చిందని కొనియాడారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వినోద్‌కు అభినందనలు తెలిపారు. ఆయన విజయాన్ని యావత్ దేశం ఆనందిస్తోందని అన్నారు.
మొత్తం మీద పారాలింపిక్స్‌లో ఆదివారం భారత్ మెరిసింది. పురుషుల హైజంప్ పోటీల్లో టీ47 కేటగిరిలో భారత అథ్లెట్ నిషాద్‌కుమార్ 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేసి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో అతడు రజతం సాధించాడు. అంతకుముందు భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.