క్రీడా గ్రామంలో కొత్తగా 28 కొవిడ్ కేసులు (Tokyo Covid Cases) వచ్చాయని టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నిర్వాహకులు తెలిపారు. ఇందులో క్రీడాకారులు ఎవరూ లేరని పేర్కొన్నారు. 13 మంది కాంట్రాక్టర్లు, ఆరుగురు క్రీడా సిబ్బంది, ఆరుగురు వాలంటీర్లు, ఇద్దరు ఉద్యోగులు, ఒక మీడియా సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. మొత్తంగా క్రీడలు ముగిసే సరికి 458 మందికి కరోనా వైరస్ సోకిందని పేర్కొన్నారు.
తాజాగా కరోనా సోకిన 28 మందిలో 21 మంది స్థానికులే. క్రీడల వల్ల మొత్తంగా 307 మంది జపనీయులకు (Tokyo Covid Cases) వైరస్ సోకింది. ఒలింపిక్స్‌లో మొత్తంగా 29 మంది అథ్లెట్లు కరోనా బారిన పడ్డారు. ఆటలకు సంబంధించిన అధికారులు 115 మంది ఉన్నారు. మొత్తంగా 249 మంది కాంట్రాక్టర్లు, 21 మంది మీడియా సిబ్బంది, 12 మంది ఉద్యోగులు, 27 మంది వాలంటీర్లు పాజిటివ్‌గా తేలారు. విదేశాల నుంచి అధికారిక గుర్తింపుతో మొత్తం 42,711 మంది క్రీడా గ్రామానికి వచ్చారు. ఈ సంఖ్యతో పోల్చుకుంటే పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య అత్యంత స్వల్పమేనని అర్థమవుతోంది. ఏదేమైనా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో టోక్యో ఒలింపిక్స్‌ను జపాన్ విజయవంతంగానే నిర్వహించింది.
ఈ క్రీడల్లో 39 స్వర్ణాలతో అమెరికా, 38తో చైనా, 27తో జపాన్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో తన ఒలింపిక్స్ రికార్డును మరింత మెరుగు పర్చుకుంది. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో తొలి పసిడి పతకం వచ్చింది.
ఇదీ చదవండి: భారత్‌కు ఒలింపిక్ అథ్లెట్లు.. సాయంత్రం సన్మానం