టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం జరిగిన పోటీల్లో భారత అథ్లెట్లు పేలవ ప్రదర్శన చేశారు. తొలుత ఆర్చరీ జట్టు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. క్వార్టర్స్‌లో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. చరిత్ర సృష్టిస్తుందనుకున్న ఫెన్సర్ భవానీ దేవి.. ఓటమితో విశ్వక్రీడల నుంచి వైదొలిగింది.
ఒక్క టేబుల్ టెన్నిస్‌లోనే భారత్‌కు విజయం దక్కింది.
జులై 26 ఫలితాలు..
ఆర్చరీ..
- సోమవారం కజకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు(అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్).. 6-2 తేడాతో విజయం సాధించింది. అనంతరం క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
- క్వార్టర్స్‌లో దక్షిణ కొరియా చేతిలో భారత జట్టు నిలువలేకపోయింది. 0-6 తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఒలింపిక్స్ నుంచి పురుషుల ఆర్చరీ జట్టు నిష్క్రమించింది.
ఆకట్టుకున్న భవానీ..
- భారత్ నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెన్సర్ భవానీ దేవి తొలి మ్యాచ్‌లో సత్తాచాటింది. ట్యూనీషియా ఫెన్సర్ నదియా బెన్ అజీజీపై 15-3తో విజయం సాధించింది. కేవలం 6 నిమిషాల్లోనే ఈ ఆట పూర్తైంది.
- అనంతరం టేబుల్ ఆఫ్-32 మ్యాచ్‌లో ఫ్రాన్స్ అథ్లెట్ మనోన్ బ్రునెట్ ముందు భవానీ నిలువలేకపోయింది. 7-15తో ఈ మ్యాచ్‌ను కోల్పోయింది భవానీ. దీంతో ఒలింపిక్స్‌లో ఆమె కథ ముగిసింది.
టీటీలో మిశ్రమ ఫలితాలు..
- టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల రెండో రౌండ్లో ఆచంట కమల్ గెలుపొందాడు. పోర్చుగల్ ఆటగాడు అపోలోనియా టియాగోపై 4-2తో విజయం సాధించాడు.
- మరో మ్యాచ్‌లో సుతీర్థ ఓటమి పాలైంది. పోర్చుగల్ ప్లేయర్ యూ ఫూ ముందు నిలువలేకపోయింది. 4-0తో పరాజయం చవిచూసింది. కనీస పోరాటం లేకుండానే సుతీర్థ విశ్వక్రీడల నుంచి నిష్క్రమించింది.
- మహిళల మూడో రౌండ్లో మనికా బాత్రా నిరాశకు గురుచేసింది. ఆస్ట్రియా క్రీడాకారిణి పోల్కనోవా సోఫియాపై 0-4 తేడాతో పరాజయం పొందింది.
టెన్నిస్‌లోనూ నిరాశే..
- పురుషుల సింగిల్స్‌లో టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ నిష్క్రమించాడు. ఆర్ఓసీ ఆటగాడు మెద్వెదెవ్ చేతిలో 2-6, 1-6 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి.. ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు.
సాత్విక్-చిరాగ్ జంట తొలి ఓటమి..
- బ్యాడ్మింటన్‌లోనూ భారత్ నిలువలేకపోయింది. డబుల్స్ జోడీ సాత్విక్ రాజ్-చిరాగ్ శెట్టి జంట తమ రెండో మ్యాచ్‌లో.. ఇండోనేసియా ద్వయంపై ఓడిపోయింది. వరుస సెట్లలో మ్యాచ్‌ను కోల్పోయింది. మంగళవారం మరో మ్యాచ్ జరగనుంది.
స్కీట్ షూటింగ్‌లోనూ..
- స్కీట్ షూటింగ్‌లోనూ భారత షూటర్లు విఫలమయ్యారు. క్వాలిఫికేషన్ రౌండ్లో భారత షూటర్ అంగద్ వీర్ సింగ్ 18వ స్థానంలో నిలిచాడు. మరో షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ 25వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
బాక్సింగ్..
- పురుషుల మిడిల్వెయిట్లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ ఆశిష్ కుమార్ పరాజయం పాలయ్యాడు. చైనా బాక్సర్ తుయోహెటా చేతిలో ఘోరంగా విఫలమయ్యాడు.
స్విమ్మింగ్..
- 200మీ. పురుషుల బటర్ ఫ్లై స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ఆకట్టుకున్నప్పటికీ.. సెమీస్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఒక నిమిషం 57.22 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నాడు ప్రకాశ్. మొత్తంగా 24వ స్థానంలో నిలిచాడు సాజన్.
హాకీ..
- జర్మనీతో జరిగిన మహిళల హాకీ మ్యాచ్‌లోనూ రాణీ రాంపాల్ సేన ఓటమి పాలైంది. ప్రత్యర్థి చేతిలో 2-0 తేడాతో ఓడింది భారత్. తదుపరి మ్యాచ్ బుధవారం గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది ఇండియా. ఇప్పటికే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం చెందింది భారత్.
ఇదీ చదవండి: మీరాబాయి చానుకు 'స్వర్ణా'వకాశం!