జపాన్ అమ్మాయి మోమిజి నిషియా టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత పిన్న వయసులో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. అరంగేట్ర మహిళల స్కేట్ బోర్డింగ్‌లో స్వర్ణం ముద్దాడింది. ప్రస్తుతం ఆమె వయసు 13 ఏళ్ల 330 రోజులు. ఈ క్రీడలో ఫైనల్ చేరిన అమ్మాయిల సగటు సైతం దాదాపు 13-14 ఏళ్లే ఉండటం విశేషం.
స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్‌లో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి రన్ రెండు ట్రిక్. రన్‌లో రెండు, ట్రిక్‌లో ఐదు అవకాశాలు ఇస్తారు. అన్నింటిలో వచ్చిన మార్కులు కూడి స్కోర్ ఇస్తారు. నిషియా రన్‌లో 3.02, ట్రిక్‌లో 4.15, 4.66, 3.43 స్కోర్లు సాధించింది. రెండు అవకాశాల్లో విఫలమైంది. మొత్తంగా 15.26తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం అందుకుంది.
కాంస్యం గెలిచిన మరో జపాన్ అమ్మాయి నకయామా ఫనా వయసు 16 ఏళ్లు మాత్రమే. 14.49తో ఆమె మూడో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌కు చెందిన లియాల్ రేసా 14.64తో రజతం అందుకుంది. ఆమె వయసు 13 ఏళ్ల 203 రోజులు. తలకు గాయమై, ఎముకలు విరిగి అత్యంత వేగంగా కోలుకున్న 13 ఏళ్ల బ్రిటన్ అమ్మాయి స్కై బ్రౌన్ ఫైనల్ ఆడలేదు.
ఇదీ చదవండి: మీరాబాయి చానుకు 'స్వర్ణా'వకాశం!