జపాన్ స్టార్ షట్లర్ యమగూచితో జరిగిన హోరాహోరీ పోరులో గెలుపొంది.. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది భారత షట్లర్ పీవీ సింధు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ సెమీస్‌కు చేరుకున్న మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఘనత సాధించిందీ తెలుగు తేజం. 2016 రియో ఒలింపిక్స్‌లో సెమీస్‌లో గెలిచిన సింధు రజతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్వర్ణంపై కన్నేసింది.
సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్స్(2008, 2012), ఓ సెమీ ఫైనల్(2012)కు చేరింది. తాజాగా సైనా పెరు మీద ఉన్న రికార్డును సింధు అధిగమించింది.
అప్పుడే అయిపోలేదు..
టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో గెలవడం ఆనందంగా ఉందని, అయితే ఇప్పుడే అంతా అయిపోయినట్లు కాదని భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు తెలిపింది. తదుపరి మ్యాచ్‌కు మరింత కఠినంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగూచిపై సింధు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యమగూచిపై సింధు 21-12, 22-20తో వరుస గేమ్‌లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా మ్యాచ్‌పై సింధు స్పందిస్తూ.. "సంతోషంగా ఉంది. కానీ, అప్పుడే అయిపోలేదు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి మ్యాచ్‌ను సమీక్షించుకోవాలి. ఆ తర్వాత కొంత రిలాక్స్ అయ్యి తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవ్వాలి. ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో షాట్ ర్యాలీలు సుదీర్ఘంగా జరిగాయి. ముందంజలో ఉన్నప్పటికీ యమగూచి కూడా బలంగా పుంజుకుంది. అందువల్ల నేను రిలాక్స్ అవలేకపోయా. నావైపు కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి. యమగూచి గేమ్ పాయింట్‌కు వచ్చినా.. నేను ఆందోళన చెందలేదు. ఏం కాదు.. మ్యాచ్‌పై దృష్టిపెట్టు. తప్పకుండా గెలుస్తావు అని కోచ్ చెప్పారు. ఆయన నాకు ఎంతగానో అండగా నిలిచారు. అందువల్లే నేను మ్యాచ్ గెలవగలిగాను" అని చెప్పుకొచ్చింది. గెలుపు కోసం తాను చాలా కఠినంగా శ్రమించానని తెలిపింది. తదుపరి మ్యాచ్ చాలా ముఖ్యమని, దానిపై మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వివరించింది.
సెమీస్‌లో తై జు యింగ్‌తో..
సెమీఫైనల్‌లో సింధు.. ప్రపంచ నంబర్ వన్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో పోటీ పడనుంది. సింధుకు ఇది చాలా కఠినమైన మ్యాచ్ అనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ 18 సార్లు తలపడగా.. 13 సార్లు తై జు విజయం సాధించింది. కేవలం 5 మ్యాచ్ విజయాలతో సింధు వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం జరగబోయే సెమీస్ పోరు కూడా రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి:- బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా- భారత్‌కు మరో మెడల్ ఖాయం