టోక్యో ఒలింపిక్స్ సెమీస్ ఓటమి నుంచి తేరుకొని ఆదివారం కాంస్య పతక పోరులో పీవీ సింధు విజయం సాధిస్తుందని ఆమె తండ్రి రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం సెమీస్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి తైజూ యింగ్ చేతిలో పీవీ సింధు ఓటమిపై ఆమె తండ్రి రమణ స్పందించారు. తైజూ అద్భుత ఆటతీరుతో సింధును ఓడించిందని.. చాలా వ్యూహాత్మకంగా ఎక్కువ ర్యాలీలు లేకుండా జాగ్రత్తపడిందన్నారు. దూకుడుగా ఆడేందుకు సింధుకు అవకాశం లేకుండా పోయిందని.. తొలి గేమ్ ఓటమి తర్వాత రెండో గేమ్‌లో పుంజుకుంటుందని భావించినా.. ఒత్తిడికి గురైనట్లు అనిపించిందని రమణ అన్నారు.
ఎలాంటి వ్యూహాలతో వస్తే ప్రపంచ నెంబర్ వన్ను ఎదుర్కోవచ్చో ఈ మ్యాచ్ ద్వారా తెలిసిందని.. భారత్‌కు పతకం తీసుకొచ్చేలా సింధు తదుపరి మ్యాచ్‌లో ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు రమణ.
సెమీస్‌లో ఇదీ జరిగింది..
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జూ యింగ్ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జూ తర్వాత సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌లో సింధు ఓటమిపాలైంది. ఇక రెండో గేమ్‌లోనూ మరింత పట్టుదలగా ఆడిన తై జూ.. భారత షట్లర్‌కు ఏ అవకాశం ఇవ్వలేదు. దాంతో సింధు రెండు వరుస గేమ్స్‌లో ఓటమిపాలైంది.
ఇదీ చూడండి:- Tokyo Olympics: సెమీస్‌లో సింధు ఓటమి.. స్వర్ణం ఆశలు ఆవిరి