ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా కోచ్ క్లాస్ బార్టోనిజ్ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) వెల్లడించింది. 2024 పారిస్ గేమ్స్ వరకు కోచ్ పదవిలో కొనసాగుతాడని పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణపతకం గెలుచుకున్నాడు. దీంతో జర్మన్‌కు చెందిన బయో మెకానికల్ ఎక్స్‌పర్ట్ అయిన క్లాస్ బార్టోనిజ్ పర్యవేక్షణలోనే మళ్లీ కోచింగ్ తీసుకోవాలని నీరజ్ ఆసక్తి చూపడం వల్ల ఏఎఫ్‌ఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
"ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణపతకం అందించిన నీరజ్ చోప్రా విజ్ఞప్తి మేరకు డాక్టర్ క్లాస్ బార్టోనిజ్ సేవలను వచ్చే 2024 పారిస్ గేమ్స్ వరకు వినియోగించుకోవాలని భావించాం" అని ఏఎఫ్‌ఐ తెలిపింది.
అదేవిధంగా 400మీ రిలే పురుషుల టీమ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గాలినా బుఖారినా కాంట్రాక్ట్‌ను కూడా పొడిగించినట్లు ఏఎఫ్‌ఐ ప్రకటించింది. ఈ ఏడాది ఆసియా గేమ్స్ వరకు కోచ్‌గా ఉంటారని తెలిపింది. బుకారియా శిక్షణలోనే మెన్స్ 400మీ రిలే జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో ఆసియా రికార్డును సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత 400మీ రిలే జట్టులో మహమ్మద్ అనాస్ యాహియా, నోహ్ నిర్మల్ టామ్, అరోకియా రాజీవ్, అమోజ్ జాకబ్ సభ్యులు పాల్గొన్నారు. పతకం రాకపోయినా ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.
ఇదీ చూడండి: Neeraj Chopra Birthday: ఊబకాయాన్ని జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి!