టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి వచ్చింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. రెండో రౌండ్లో 87.58 మీ. దూరం బల్లెం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో దేశవ్యాప్తంగా నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకుర్, పలువురు అతనికి అభినందనలు తెలిపారు.
"నీరజ్ చోప్రా.. ఇది అద్వితీయమైన గెలుపు. స్వర్ణ పతాకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పసిడి పతకం తీసుకొచ్చిన నీ ప్రతిభ.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. భారతదేశం.. నీ విజయానికి సంతోషిస్తోంది. హృదయపూర్వక అభినందనలు" అని రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
"టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. ఈరోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చిరకాలం గుర్తుంటుంది. చాలా చక్కగా రాణించాడు. ఒక ప్యాషన్‌తో తనదైన శైలిలో ఆడిన నీరజ్‌కు నా అభినందనలు" అని మోదీ ట్వీట్ చేశారు.
"భారత్‌కు స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు వంగి నమస్కరిస్తున్నా. దేశం గర్వపడేలా చేశావు" అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నాడు.
"టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి తన గెలుపుతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.ఇది గొప్ప విజయం. ఇన్నాళ్లు భారతీయులు వేచి చూస్తున్న స్వర్ణ పతక నిరీక్షణకు తెరపడింది" అని వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
"నీరజ్ చోప్రా.. పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించాడు. ఇండియా గోల్డెన్ బాయ్" అని అనురాగ్ ఠాకుర్ ప్రశంసించారు.
"స్వర్ణం సాధించాలన్న దేశ ప్రజల కోరికను నువ్వు సాధించావ్ నీరజ్ చోప్రా. నీ విజయానికి నేను వంగి నమస్కరిస్తున్నా. పసిడి పతకాన్ని దేశానికి అందించినందుకు ధన్యవాదాలు. అలాగే గోల్డ్ క్లబ్‌కు వెల్కమ్. ఇలాంటి పతకాలు మరెన్నో తీసుకురావాలి. చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది" అని షూటర్ అభినవ్ బింద్రా పేర్కొన్నాడు.
"నీరజ్ చోప్రా దేశం గర్వపడేలా చేశాడు. భారతీయ క్రీడకు ఇది మరిచిపోలేని క్షణం. యువ అథ్లెట్‌కు అభినందనలు" అని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ట్వీట్ చేశాడు.