ఈ సారి ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకావకాశాలు ఉన్న ఆటల్లో హాకీ ఒకటి. అందుకు అనుగుణంగానే పురుషుల, మహిళల జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. అయితే గ్రూప్ దశలో వరుస ఓటములతో కొంత అనుమానాలు రేకెత్తించిన రాణి రాంపాల్ సేన.. తిరిగి పోటీలో నిలిచింది. ఎలాగోలా క్వార్టర్స్‌కు చేరుకున్నమనుకున్నా మన జట్టుకు ఆస్ట్రేలియా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. అయినప్పటికీ 1-0 తేడాతో చిత్తుగా ఓడించి కంగారూలకు ఝలక్ ఇచ్చింది. తొలిసారి సెమీస్‌లోకి అడుగుపెట్టింది భారత జట్టు. అయితే ఈ విజయం వెనక ఆటగాళ్ల విశేష కృషి ఉంది. ఈ సందర్భంగా మహిళా ప్లేయర్ల గురించి ప్రత్యేక కథనం.
రాణి రాంపాల్..
హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలోని షాబాద్ రాణి స్వస్థలం. చిన్ననాటి నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న రాణి.. విరిగిన హాకీ స్టిక్‌తో తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఆటపై ఉన్న మక్కువతో 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు సంపాదించింది. అనతికాలంలోనే టీమ్‌లో తనదైన ముద్ర వేసింది.
జట్టులో స్ఫూర్తిదాయక ఆటగాళ్లలో కెప్టెన్ రాణి రాంపాల్ ఒకరు. ఆమె సారథ్యంలో టీమ్ చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసింది. 13 ఏళ్ల అనంతరం 2017లో మహిళల ఆసియా కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది మన జట్టు. 2018 ఆసియా గేమ్స్‌లో భారత్‌కు వెండి పతకం అందించింది రాణి.
సవిత పూనియా..
హరియాణాలోని సిర్సా జిల్లాకు చెందిన సవిత భారత అత్యుత్తమ గోల్కీపర్లలో ఒకరు. దక్షిణాఫ్రికా డర్బన్‌లో జరిగిన స్పార్ కప్ ఫోర్ నేషన్స్ టోర్నీ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపికైంది. అప్పుడు పూనియా వయసు 18 ఏళ్లు.
పూనియాకు జీవితంలో జూడో లేదా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా స్థిరపడాలని ఉండేది. కానీ, తన తాతయ్య కారణంగా హాకీని ఎంచుకుంది. ఆమెకు ఇష్టం లేనప్పటికీ 20 కిలోల గోల్‌కీపింగ్ కిట్‌తో రెండు గంటల పాటు ప్రయాణించి ఆటలో మెలకువలు నేర్చుకుంది.
ఇదీ చదవండి: Olympics: డిస్కస్ త్రోలో నిరాశపర్చిన కమల్‌ప్రీత్ కౌర్
నేహా గోయల్..
హరియాణాలోని సోనేపట్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నేహా.. అతి తక్కువ కాలంలో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా మారింది. 2018 ఆసియా గేమ్స్‌లో వెండి పతకం గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలు. జట్టులోకి రాకముందు నేహా తన తల్లి, సోదరిలతో కలిసి ఓ సైకిల్ ఫ్యాక్టరీలో పనిచేసేది. నేహా తన తల్లి సాయంతో హాకీ అకాడమీలో చేరి.. ఆటపై పట్టు సాధించింది.
2011లో జరిగిన జూనియర్ ఆసియా కప్ సందర్భంగా తొలిసారిగా టీమ్ఇండియా తలుపుతట్టింది నేహా. అప్పుడామెకు 14 ఏళ్లు. అదే ఏడాది అండర్ 21 ఫోర్ నేషన్స్ లాల్ బహదూర్ శాస్త్రి మహిళల హాకీ టోర్నీ ద్వారా జట్టులో సుస్థిర స్థానం సంపాదించింది. 2014లో గ్లాస్గోలో జరిగిన ఎఫ్ఐహెచ్ ఛాంపియన్స్ ఛాలెంజ్‌లో సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకుంది.
సలీమా టేటే..
ఝార్ఖండ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సిందిగా జిల్లాలోని బడ్కిచాపర్ గ్రామం సలీమా స్వస్థలం. 2018 యూత్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన భారత జట్టుకు సలీమా సారథ్యం వహించింది.
టేటే ఆటను చూడటానికి ఆమె స్వగ్రామంలో ఇప్పటికీ ఒక్క టీవీ కూడా లేదు. అక్కడ కనీసం ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండదు. సలీమా నాన్న రైతు. హాకీపై ఆయనకు ఉన్న ప్రేమతో తన కూతురును ఆ ఆట వైపు ప్రోత్సాహించారు. ప్రారంభంలో సలీమా ప్రాక్టీస్ చేయడానికి సరైన హాకీ స్టిక్స్ కూడా ఉండేవి కాదు. కేవలం కర్రలతోనే ఆమె సాధన కొనసాగించేది.
నిక్కీ ప్రధాన్..
27 ఏళ్ల నిక్కీది.. ఝార్ఖండ్ కుంతిలోని హెసల్ గ్రామం. ఈ ప్రాంతం మొత్తం గిరిజన ఆవాసం. నక్సల్స్‌కు మంచి పట్టున్న ప్రాంతం.
రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నిక్కీ.. విశ్వక్రీడల్లో ఆ రాష్ట్రం నుంచి పాల్గొన్న తొలి హాకీ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అప్పటినుంచి భారత్ పాల్గొన్న ప్రతి ముఖ్యమైన టోర్నీలో నిక్కీ భాగమైంది.
నిక్కీ తండ్రి బిహార్‌లో పోలీసుగా ఉద్యోగం చేస్తున్నారు. దీంతో సంరక్షణ బాధ్యతలన్నీ ఆమె తల్లి చూసుకునేది. నిక్కీ హాకీ ఆడే తొలినాళ్లలో చాలా భయపడేదట. హాకీ కర్ర ఎక్కడ తనకు తగిలి కాళ్లు విరుగుతాయేమోనని ఆందోళన చెందేదట.
ఇదీ చదవండి: రెజ్లర్ సుశీల్‌పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్
లాల్రేమియామి..
జట్టులోని యువ క్రీడాకారిణిలలో లాల్రేమియామి ఒకరు. మిజోరంలోని కోలసిబ్లో జన్మించిన ఈ 21 ఏళ్ల ప్లేయర్.. ఆ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి క్రీడాకారిణి.
2018 యూత్ ఒలింపిక్స్‌లో భారత జట్టు వెండి పతకం గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అప్పటి నుంచి లాల్రేమియామిని సియామి అనే ముద్దుపేరుతో పిలుచుకుంటారు సహచర సభ్యులు.
హాకీ కెరీర్‌గా ఎంచుకోవడానికి ఆమె ఇష్టపడినా.. ఆమెకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదు. కారణం, ఆ రాష్ట్రంలో హాకీకి అంతగా ప్రాధాన్యత లేకపోవడమే. తర్వాత ఎలాగోలా జట్టుతో చేరినా.. భాష సమస్య వచ్చింది. తన సైగలతో తన భావాలను సహచరులతో పంచుకునేది లాల్రేమియామి.
జపాన్ హిరోషిమా వేదికగా ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లో భాగంగా చిలీతో జరిగిన సెమీస్‌కు ముందు లాల్రేమియామి తండ్రి మృతి చెందారు. ఒలింపిక్స్ అర్హత టోర్నీల్లో ఒకటైన ఈ మ్యాచ్ కోసం ఇంటికి కూడా వెళ్లకుండా, తండ్రి మరణాన్ని దిగమింగి ఆడింది.
దీప్ గ్రేస్ ఎక్కా..
నిరాడంబరమైన గిరిజన రైతు కుటుంబంలో జన్మించింది గ్రేస్. ఐదుగురు సంతానంలో చిన్నది. 12 ఏళ్లు వచ్చేంతవరకు ఆమెకు హాకీ స్టిక్ అంటే ఏమిటో తెలీదు.
హాకీని క్రీడగా ఎంచుకున్న తర్వాత ఆమె కుటుంబంపై చాలా మంది విమర్శలు చేశారు. అయిన ఇవేమీ పట్టించుకోకుండా ఆమె ఆటలో రాణించింది. ఒడిశా నుంచి వచ్చిన అత్యుత్తమ డిఫెండర్లలో గ్రేస్ ఒకరు. గోల్‌కీపర్‌గా ఆడాలని ఎక్కాకు ఇష్టంగా ఉండేది. 2013 మహిళల ఆసియా కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న సీనియర్ జట్టులో గ్రేస్ సభ్యురాలు.
సుశీలా చాను..
జట్టులోని అనుభవజ్ఞులలో సుశీలా ఒకరు. రియో ఒలింపిక్స్‌లో జట్టుకు నాయకత్వం వహించింది. మణిపూర్ ఇంఫాల్‌కు చెందిన చాను.. 11 ఏళ్లకే హాకీ స్టిక్‌ను చేత పట్టింది. తన తండ్రి డ్రైవర్. 18 ఏళ్లకే టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం. కానీ, మనసంతా ఆటపైనే. దీంతో హాకీనే జీవితమనుకుంది.
2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన చాను.. జట్టుకు కొన్ని తిరుగులేని విజయాలు అందించింది. భువనేశ్వర్ వేదికగా 2019లో జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది.
తొలుత కనీసం రాష్ట్ర జట్టుకు కూడా ఎంపిక కాలేదు చాను.. దీంతో కొంతకాలం హాకీని పక్కనపెట్టింది.
ఇదీ చదవండి: P.V. Sindhu: కాంస్యం గెలవడం సంతోషంగా ఉంది
గుర్జీత్ కౌర్..
భారత జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లలో గుర్జీత్ ఒకరు. డిఫెండర్‌గా, ఫ్లిక్కర్గా రెండు పాత్రలు పోషిస్తుంది. ఇండియా సాధించిన అద్భుత విజయాలలో గుర్జీత్ పాత్ర అసాధారణం. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై విజయంలో చేసిన ఏకైక గోల్ గుర్జీత్ చేసినదే.
పంజాబ్ అమృత్‌సర్‌లోని మియాదిలో జన్మించింది గుర్జీత్. తొలుత ప్రైవేట్ పాఠశాలలో చదివిన కౌర్‌కు బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లే వరకు కూడా హాకీ అంటే ఏమిటో తెలియదు. తర్వాత వేరే అమ్మాయిలు ఆడుతుంటే చూసి ఆటపై ఇష్టం పెంచుకుంది.
వందన కఠారియా..
ఉత్తరాఖండ్‌లోని రోష్నబాద్ గ్రామానికి చెందిన వందన.. ప్రస్తుత భారత జట్టులో కీ ప్లేయర్. ఒలింపిక్స్‌కు మూడు నెలల ముందు ఆమె తండ్రి మరణించారు. అయినా ప్రాక్టీస్ వల్ల ఆమె వెళ్లలేకపోయింది. తన తండ్రి కారణంగానే హాకీలోకి వచ్చింది వందన.
నవజ్యోత్ కౌర్..
భారత జట్టు అటాకింగ్ మిడ్ ఫీల్డర్ నవజోత్ కౌర్.. హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందినది. 2012లో భారత జట్టులో స్థానం సంపాదించింది. జూనియర్ ఆసియా కప్‌తో పాటు ఇంటర్నేషనల్ అండర్ 21 టోర్నీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. అప్పటినుంచి భారత జట్టు సాధించిన ముఖ్యమైన విజయాల్లో కౌర్ భాగమైంది.
భారత జట్టులోని చాలామంది లాగే.. నవజోత్‌కు క్రీడానేపథ్యమేమీ లేదు. ఆమె తండ్రి మెకానిక్‌గా పనిచేసేవారు.
నవనీత్ కౌర్..
జట్టులోని స్థిరమైన ఫార్వర్డ్ ప్లేయర్లలో నవనీత్ కౌర్ ఒకరు. ఆమె స్వస్థలం హరియాణాలోని షాబాద్. ఒలింపిక్స్‌కు ముందు గత మేలో కొవిడ్ బారిన పడి కొంత ఇబ్బంది పడింది.
ఇదీ చదవండి: సుప్రీం ఆదేశంతో పారాలింపిక్స్ బృందంలోకి షూటర్
షర్మిలా దేవి..
2019 ఒలింపిక్స్ అర్హత టోర్నీలో షర్మిలా అరంగేట్రం చేసింది. టోక్యో క్రీడలకు ముందు భారత జట్టు తరఫున కేవలం 9 గేమ్‌లు మాత్రమే ఆడింది షర్మిలా.
మోనికా..
హరియాణాకు చెందిన మోనికా.. చాలా టోర్నీలలో స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఒలింపిక్స్ అర్హత టోర్నీ అయిన ఎఫ్ఐహెచ్ సిరీస్‌లో అమెరికాపై రాణించింది. 6-5తో భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
నిషా..
హరియాణాలోని సోనేపట్‌కు చెందిన నిషా.. తన అరంగేట్రం మ్యాచ్ 2019లో ఆడింది. హిరోషిమా వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తండ్రి ఒక టైలర్. హాకీ ఆడాలన్న తన కూతురి కోరికను నెరవేర్చాడు. ఆమె ప్రయాణాల కోసం కొంత మొత్తం పక్కకు పెట్టేవాడు.
ఉదిత..
హరియాణాలోని హిస్సార్‌లో జన్మించింది ఉదిత. 2017 న్యూజిలాండ్ పర్యటనలో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు భారత్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడింది.
చిన్నతనంలోనే ఆటలు ఆడటం ప్రారంభించినప్పటికీ.. తొలుత హ్యాండ్‌బాల్‌లో ప్రావీణ్యం సంపాదించింది. తర్వాత మెల్లగా హాకీ వైపు అడుగులు వేసింది.
స్జోర్డే మారిజ్నే..
2017లో మహిళల హాకీ జట్టు కోచ్‌గా నియమితుడైన డచ్ ఆటగాడు స్జోర్డే మారిజ్నే. తర్వాత కొంత కాలానికే భారత పురుషుల జట్టుకు కోచ్‌గా వెళ్లాడు. మళ్లీ 2018లో తిరిగి మహిళల జట్టు కోచ్‌గా తిరిగి నియామకం అయ్యాడు.
ఆటగాడిగా నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మారిజ్నే.. కోచ్‌గా మహిళల అండర్ 21 ప్రపంచకప్ అందించాడు. డచ్ సీనియర్ మహిళల జట్టుకు స్వర్ణం సాధించిపెట్టాడు.
ఇదీ చదవండి: Olympics: ఫైనల్ బెర్త్‌పై హాకీ పురుషుల జట్టు గురి