'సారీ ఇండియా..ఈ ఒలింపిక్స్‌లో నీకు గొప్ప పేరు తీసుకురాలేకపోయా' అంటూ భారత స్టార్ ఆర్చర్ అతాను దాస్ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశాడు. లండన్ ఒలింపిక్ విజేత, కఠిన ప్రత్యర్థి హో జిన్‌హెక్‌పై సంచలన విజయం సాధించి..ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న దాస్ పతకంపై ఆశలు కల్పించాడు. కానీ, శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో మాత్రం జపాన్ ఆర్చర్ చేతిలో ఓడి, నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. స్వల్ప తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
ఫలితంగా తన ఓటమిపై అతాను దేశ ప్రజలకు క్షమాపణలు తెలియజేశాడు. అలాగే వెన్నంటి నిలిచిన అధికారులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని దాటుకొని ముందుకువెళ్లాల్సి ఉందని, లేకపోతే చెప్పడానికి ఏమీ ఉండదనే ఆశావహ దృక్పథాన్ని వెలిబుచ్చాడు. జై హింద్ అంటూ తన ట్వీట్‌ను ముగించాడు.
అలాగే మ్యాచ్ అనంతరం అతాను మాట్లాడుతూ.. ప్రతి మ్యాచ్ వైవిధ్యంగా ఉంటుందని, అక్కడి పరిస్థితులు, క్రీడాకారుల ఆలోచనా విధానం అన్నీ మరోలా ఉంటాయని పేర్కొన్నాడు. ఇక్కడ తాను ఓడిపోయినా శక్తిమేరకు పోరాడానని చెప్పాడు. వచ్చేసారి ఇంకా బాగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో అతడు జపాన్ ఆర్చర్ తాకాహరు ఫురుకవా చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ దాస్ 4-6 తేడాతోనే కొరియన్ ఛాంపియన్ లీ సింగ్యన్ చేతిలో ఓటమిని చవిచూశాడు.
ఇదీ చూడండి:- డిస్కస్ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్.. ఆర్చరీ, బాక్సింగ్‌లో నిరాశ