కరోనా మరో టోర్నమెంట్‌ను దెబ్బకొట్టింది. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వింబుల్డన్ రద్దయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే తొలిసారి. షెడ్యూలు ప్రకారం ఈ టోర్నీ జూన్ 29 నుంచి జులై 12 వరకు జరగాల్సివుంది. కరోనా నేపథ్యంలో టోర్నీని వాయిదా వేస్తారని భావించారంతా. కానీ బుధవారం అత్యవసర సమావేశం అనంతరం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్.. వింబుల్డన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. 2021 టోర్నీ జూన్ 28న ఆరంభమవుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో దిగ్గజ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ మళ్లీ కనిపించకపోవచ్చు! వచ్చే ఏడాది టోర్నీ సమయానికి ఫెదరర్, సెరెనా వయసు 40 ఏళ్లకు చేరువ అవుతుంది. వీనస్ 41 ఏళ్లకు చేరుతుంది.
ఈ జులై 13 వరకు పురుషులు, మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఏటీపీ, డబ్ల్యూటీఏ ప్రకటించాయి. వింబుల్డన్‌ను తొలిసారి 1877లో నిర్వహించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 నుంచి 1918 వరకు, రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 నుంచి 1945 వరకు తప్ప.. టోర్నీ నిరంతరాయంగా సాగింది. కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌ను మే నుంచి సెప్టెంబరుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. యుఎస్ ఓపెన్ (ఆగస్టు 31 నుంచి) షెడ్యూల్‌లో ఇంకా మార్పులు చేయలేదు