మహిళల సింగిల్స్ ప్రపంచ మూడో ర్యాంకర్ ప్లిస్కోవా (ఫ్రాన్స్)కు షాక్ తగిలింది. తొలి రెండు ర్యాంకు క్రీడాకారిణులు టోర్నీకి దూరమవడం వల్ల టాప్‌సీడ్‌గా బరిలో దిగిన ఆమె రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ 50వ ర్యాంకర్ కరోలినా గార్సియా 6-1, 7-6 (7/2) తేడాతో ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే గార్సియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్లిస్కోవాను అనామక క్రీడాకారిణిగా మార్చేస్తూ వరుస గేమ్‌లు గెలుచుకుంది. వేగవంతమైన సర్వీస్‌లు, బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో పాయింట్లు సాధించింది. చూస్తుండగానే 5-0తో దూసుకెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ప్లిస్కోవా ఓ గేమ్ గెలిచినప్పటికీ.. తిరిగి బలమైన షాట్లతో చెలరేగిన గార్సియా తర్వాతి గేమ్ గెలుచుకుని సెట్ సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ జోరు కొనసాగించిన ఆమె ఓ దశలో 4-2తో విజయం దిశగా సాగింది.
ఆ దశలో పుంజుకున్న ప్లిస్కోవా వరుసగా మూడు గేమ్‌లు గెలిచి ఆధిక్యం సంపాదించింది. కానీ గార్సియా పట్టు వదలకుండా పోరాడి 6-6తో స్కోరు సమం చేసింది. టైబ్రేకర్‌లో మరింతగా చెలరేగి మ్యాచ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గార్సియా మూడు ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది. ప్లిస్కోవా 19 అనవసర తప్పిదాలు చేసింది. పదో సీడ్ ముగురుజ (స్పెయిన్) కూడా రెండో రౌండ్ దాటలేకపోయింది. ఆమె 5-7, 3-6తో పిరంకోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది. నాలుగో సీడ్ ఒసాకా (జపాన్) మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఆమె 6-1, 6-2తో జియోర్గి (ఇటలీ)ని వరుస సెట్లలో చిత్తుచేసింది. 4 ఏస్‌లు సంధించిన ఒసాకా. 14 విన్నర్లు కొట్టింది. ఇతర మ్యాచ్‌లో 18వ సీడ్ వెకిచ్ (క్రొయేషియా) 6-2, 6-1తో ప్యాట్రిక మరియాపై విజయం సాధించింది. జబెర్, సకారి మూడో రౌండ్లో ప్రవేశించారు.
ఎదురులేని జకోవిచ్
పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్ జకోవిచ్ (సెర్బియా)కు ఎదురులేకుండా పోయింది. రెండో రౌండ్లో అతను 6-7 (5/7), 6-3, 6-4, 6-2తో ఎడ్మండ్ (యూకే)పై విజయం సాధించాడు అన్‌సీడెడ్ ఎడ్మండ్ నుంచి తొలి సెట్లో జకోవిచ్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడం వల్ల ఆ సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో ఎడ్మండ్ 7-5తో సెట్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పుంజుకున్న జకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అతను 16 ఏస్‌లు, 52 విన్నర్లు కొట్టాడు. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో తన విజయాలను 25-0కు పెంచుకున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో.. నాలుగో సీడ్ సిట్సిపాస్ (బ్రిటన్) 7-6 (7-2), 6-3, 6-4తో క్రెస్సీ (యుఎస్‌ఏ)పై, అయిదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7-5, 6-7 (8/10), 6-3, 6-1తో నకషిమ (యుఎస్‌ఏ)పై, ఏడో సీడ్ గొఫిన్ (బెల్జియం) 7-6 (8/6), 4-6, 6-1, 6-4తో హారిస్ (దక్షిణాఫ్రికా)పై నెగ్గారు. షపోవలోవ్ (కెనడా), కొరిచ్ (క్రొయేషియా) కూడా ముందంజ వేశారు.