కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం అల్లాడుతోంది. ఆటలన్నీ ఆగిపోయాయి. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 75 ఏళ్ల తర్వాత తొలిసారి వింబుల్డన్ ఓపెన్ రద్దయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తిరిగి టెన్నిస్ ఆటను చూడగలమా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
కరోనా రక్కసి విజృంభించక ముందు జనవరిలో ఆరంభమై ఫిబ్రవరిలో ముగిసిన సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత వైరస్ ధాటికి టోర్నీలు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. వచ్చే నెలలో ఆరంభం కావాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. తాజాగా జూన్‌లో మొదలవాల్సిన వింబుల్డన్ ఓపెన్ మొత్తానికే రద్దయింది. ఇక మిగిలింది ఆగస్టులో ఆరంభం కావాల్సిన యుఎస్ ఓపెన్. అయితే ప్రస్తుతం అమెరికాలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే అక్కడ రోగుల సంఖ్య రెండు లక్షలు దాటింది. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ దేశంలో పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ఇప్పటికిప్పుడైతే వైరస్‌ను అరికట్టే మార్గాలు కనిపించట్లేదు. కాబట్టి యుఎస్ ఓపెన్ నిర్వహణపై కూడా కారుమబ్బులు కమ్ముకున్నాయి.
ఆ దేశంలో కరోనా వ్యాప్తి, మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. యుఎస్ ఓపెన్ గురించి ఎంతమాత్రం ఆలోచించే పరిస్థితి లేదు. ఆ వెంటనే నిర్వహించాలని తలపెట్టిన ఫ్రెంచ్ ఓపెన్ కూడా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీలదీ అదే దారి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో తిరిగి టెన్నిస్ టోర్నీలు జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వింబుల్డన్‌ను నిర్వహించే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సీఈవో రిచర్డ్ లూయిస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "ఈ ఏడాది ఇక టెన్నిస్ ఉండబోదనేది అబద్ధం కాదని అనుకుంటున్నా. అయితే పరిస్థితులన్నీ చక్కబడి తిరిగి టోర్నీలు జరిగే అవకాశం ఉంటుందేమోనని ఆలోచిస్తున్నా. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జరగాలని ఆశిద్దాం. మాంట్రియల్, టొరొంటో, సిన్సినాటి లాంటి ఏటీపీ టోర్నీలూ జరగాలనే సానుకూల దృక్పథంతో ఉన్నా. అయితే ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి" అని రిచర్డ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి : కరోనా విషయంలో ఊపిరి పీల్చుకున్న సఫారీ క్రికెటర్లు