మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ వచ్చే ఏడాది వింబుల్డన్‌కూ(Wimbledon 2022) దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే సీజన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. ఇప్పుడు అతని మాటలను బట్టి చూస్తే అతను వచ్చే ఏడాది జూన్ 27న ఆరంభమయ్యే వింబుల్డన్‌లోనూ ఆడే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి.
"నిజంగా చెప్తున్నా.. నేను వింబుల్డన్ ఆడితే ఆశ్చర్యపోవాల్సిందే" అని 40 ఏళ్ల ఫెదరర్ అన్నాడు. ఈ ఏడాది వింబుల్డన్ క్వార్టర్స్‌లో ఓడిన ఫెదరర్‌కు ఆ తర్వాత కొద్ది రోజులకే మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. 18 నెలల వ్యవధిలో అతని మోకాలికిది మూడో శస్త్రచికిత్స. దాని నుంచి కోలుకుంటున్న అతను వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడనని ముందే తెలిపాడు. "అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇలాంటి శస్త్రచికిత్స నుంచి కోలుకునేందుకు నెలల పాటు సమయం పడుతుందని ముందే తెలుసు" అని ఫెదరర్ పేర్కొన్నాడు.
సెమీస్‌లో జకో, మెద్వెదెవ్
ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో(ATP Tennis Finals 2021) ప్రపంచ నం.1 నొవాక్ జకోవిచ్, డిఫెండింగ్ ఛాంపియన్ మెద్వెదెవ్ సెమీస్‌కు అర్హత సాధించారు. తమ గ్రూప్‌ల్లో వరుసగా రెండో విజయాన్ని సాధించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ముందంజ వేశారు. బుధవారం గ్రీన్ గ్రూప్‌లో జకోవిచ్ 6-3, 6-2తో ఆండ్రి రుబ్లెవ్ (రష్యా)ను ఓడించగా.. రెడ్ గ్రూప్‌లో మొద్వెదెవ్ 6-3, 6-7 (3-7), 7-6 (8-6) తేడాతో జ్వెరెవ్ (జర్మనీ)పై పోరాడి గెలిచాడు. సీజన్‌లో ఆఖరిదైన ఈ టోర్నీలో విజయం సాధించి.. ఫెదరర్ పేరిట ఉన్న రికార్డు (6 టైటిళ్లు)ను సమం చేయాలని జకోవిచ్ పట్టుదలగా ఉన్నాడు.
ఫైనల్లో కొంటావీట్‌తో ముగురుజా ఢీ
ఈ సారి డబ్ల్యూటీఏ ఫైనల్స్(WTA Tennis Finals) ట్రోఫీని కొత్త ఛాంపియన్ అందుకోనుంది. ముగురుజా, కొంటావీట్ తుదిపోరులో తలపడనున్నారు. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో గురువారం తేలిపోనుంది. బుధవారం సెమీస్‌లో ఆరో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-3 తేడాతో తన దేశానికి చెందిన ఏడో సీడ్ బడోసాపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఎనిమిదో సీడ్ కొంటావీట్ (ఈస్తోనియా) 6-1, 3-6, 6-3తో సక్కారి (గ్రీస్)పై గెలిచింది.
ఇదీ చదవండి: