ఫ్రెంచ్ ఓపెన్‌కు కొన్ని రోజుల ముందే జరుగుతున్నందున తాను యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగానని, కరోనా భయంతో కాదని టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ అన్నాడు. అంత త్వరగా హార్డ్ కోర్టు నుంచి క్లే కోర్టుకు మారడం తన శరీరానికి ప్రమాదకరమని భావించినట్లు చెప్పాడు. యూఎస్ ఓపెన్ న్యూయార్క్‌లో ఆగస్టు 31న ఆరంభం కానుండగా.. 15 రోజుల తర్వాత పారిస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభమవుతుంది. యూఎస్ ఓపెన్‌లో ఆడనని ఈ నెలలోనే నాదల్ ప్రకటించాడు.
"ఇలా వైదొలగాలని నేనెప్పుడూ కోరుకోలేదు. కానీ మనసు చెప్పినట్లు నడుచుకున్నా. కొంతకాలం ప్రయాణం చేయకపోవడమే నాకు మంచిది. షెడ్యూల్ కూడా సవాలుగా మారింది. పెద్దగా సన్నాహం లేకుండా హార్డ్ కోర్టు నుంచి క్లే కోర్టుకు వెళ్లడం నా శరీరానికి, నా భవిష్యత్తుకు ప్రమాదకరం" -నాదల్, టెన్నిస్ ప్లేయర్
ఫెదరర్ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డు (20)కు నాదల్ మరో టైటిల్ దూరంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై తాను నమ్మకంగా ఉన్నానని.. అందుకోసమే సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. నాదల్ ఇప్పటివరకు 12సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు.