భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)కు వెళ్లట్లేదు. టోక్యోకు వెళ్లబోతున్న నలుగురు భారత షట్లర్లతో పాటు మరో అయిదుగురు సహాయ సిబ్బందికి మాత్రమే భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) (Indian Olympic Association) అనుమతి ఇచ్చింది. వీరిలో ముగ్గురు కోచ్‌లు కాగా.. మరో ఇద్దరు ఫిజియోలు. కొరియా కోచ్ టాసంగ్ పార్క్ వద్ద పీవీ సింధు శిక్షణ తీసుకుంటుండగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలకు మతియాస్ బో (డెన్మార్క్) మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నాడు. వాళ్లిద్దరితో పాటు చీఫ్ కోచ్‌గా గోపీకి వెళ్లే అవకాశముంది.
కానీ, అగస్ సాంటోసా (ఇండోనేసియా) దగ్గర సాయిప్రణీత్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీంతో గోపి టోక్యోకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. సింధు, సాత్విక్, చిరాగ్, సాయిప్రణీత్, పార్క్, మతియాస్, సాంటోసాతో పాటు ఫిజియోలు సుమంశ్, ఇవాంజలిన్ టోక్యో విమానం ఎక్కనున్నారు. "కరోనా మహమ్మారి మొదలయ్యాక సాయి ప్రణీత్.. సాంటోసా వద్ద శిక్షణ పొందుతున్నాడు. సాంటోసాకు అవకాశం కల్పించడం కోసం గోపి టోక్యోకు వెళ్లడం లేదు" అని భారత బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా చెప్పాడు. కరోనా నేపథ్యంలో సహాయ సిబ్బంది సంఖ్యపై టోక్యో నిర్వాహకులు పరిమితి విధించారు.
ఇదీ చదవండి: Gopichand: బ్యాడ్మింటన్లో మూడు పతకాలు ఖాయం