ప్రొఫెషనల్ టెన్నిస్‌కు పునఃప్రారంభంగా భావిస్తోన్న పలెర్మో ఓపెన్ అమ్మాయిల టోర్నీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్(రొమేనియా) ఆదివారం ప్రకటించింది. గత పద్నాలుగు రోజులుగా రొమేనియాలో గడిపిన ప్రజలు ఇటలీకి వస్తే క్వారంటైన్లో ఉండాల్సిందేనన్న నిబంధనల కారణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.
"రొమేనియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణం పట్ల నాకున్న ఆందోళన కారణంగా పలెర్మో ఓపెన్ నుంచి తప్పుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా తరఫున అన్ని ప్రయత్నాలు చేసిన టోర్నీ డైరెక్టర్‌కు, ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు" అని హలెప్ ట్వీట్ చేసింది.
ఆగస్టు 3న ఈ టోర్నీ ఆరంభం కానుంది. దాదాపు ఐదు నెలల తర్వాత జరగనున్న తొలి(పురుషులు, మహిళల్లో కలిపి) ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీ ఇదే కావడం వల్ల హలెప్ బరిలోకి దిగాలనుకుంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ ఓస్టాపెంకో లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణి సహా తొలి 20 ర్యాంకులోపు క్రీడాకారిణులు జొహన్న కొంటా, పెట్రా మార్టిచ్, మరియా సక్కారి ఇందులో పాల్గొనబోతున్నారు.