గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే ప్లేయర్లకు కలిగే కిక్కే వేరు. పార్టీలు చేసుకుంటూ.. సంబరాలు జరుపుకొంటూ ఆ విజయాన్ని ఆస్వాదించడం చూస్తుంటాం. కానీ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జకోవిచ్ మాత్రం.. విజయం తర్వాత నేరుగా బొటానికల్ గార్డెన్‌లోకి వెళ్లి మేడి చెట్టు ఎక్కేశాడు. అదేంటీ అని అడిగితే... ఆ వృక్షం తన స్నేహితుడని చెబుతున్నాడు. "ఆ చెట్టు నా మిత్రుడు. దాన్ని ఎక్కడం నాకిష్టం. ఆ వృక్షంతో నాకు మంచి అనుబంధం ఉంది" అని తెలిపాడు.
జకోది ఓ విభిన్నమైన వ్యక్తిత్వం అని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో తన గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను 17కు పెంచుకున్న ఈ సెర్బియా యోధుడు... ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కోసం మూడు విషయాలు పాటిస్తున్నాడు. అవేంటో చూసేద్దాం పదండి.
మాంసాహారం మానేసి..
ఆటలో మెరుగైన ప్రదర్శన కోసం జకోవిచ్ పూర్తి శాకాహారిగా మారాడు. నాలుగన్నరేళ్ల క్రితం మాంసాహారానికి స్వస్థి పలికిన అతను అప్పటి నుంచి కూరగాయలు, ఆకు కూరలే తింటున్నాడు. బలంగా తయారవడం కోసం, అలసట నుంచి త్వరగా కోలుకోవడానికి శాకాహారం ఎంతో తోడ్పడుతోందని చెబుతున్నాడు. "శాకాహారిగా మారే విషయంలో మిగతా అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలుస్తాననే నమ్మకం ఉంది. దృఢమైన కండలతో పాటు బలం పొందడానికి, అలసట నుంచి త్వరగా కోలుకోవడానికి శాకాహారం ఉపయోగపడుతోంది" అని జకో పేర్కొన్నాడు.
ఆధ్యాత్మిక పాఠాలు...
గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రతి మ్యాచ్ ఓ పరీక్షే. తీవ్ర ఒత్తిడి మధ్య ఆడుతూ.. ప్రత్యర్థిపై పైచేయి సాధించాల్సి ఉంటుంది. ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడమే కాకుండా మనసునూ ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం జకో ఆధ్యాత్మిక బోధనలు వింటున్నాడు. ప్రేమ, శాంతి గురించి బోధించే స్పెయిన్‌కు చెందిన పెపీ ఇమాజ్ దగ్గర అతను ఈ ఆధ్యాత్మిక పాఠాలు వింటున్నాడు. "నేను కుర్రాడిగా ఉన్నపుడు చిన్న విషయాలకే ఓపిక కోల్పోయేవాణ్ని. చిరాకు పడుతుండేవాణ్ని. ఆ విధానాన్ని మార్చుకోవాలనే ఆలోచనతోనే నేర్చుకోవడం మొదలైంది. కుర్రతనంలోనే పూర్తిస్థాయి టెన్నిస్ ఆటగాడిగా, పరిపూర్ణ మనిషిగా ఉండలేం" అని జకో అంటున్నాడు.
ఆ కౌగిలింతలు...
తెల్లవారుతుండగానే సూర్యోదయాన్ని చూస్తూ.. కుటుంబంతో కలిసి పాటలు పాడుతూ.. ఒకరినొకరు హత్తుకోవడం.. ఆ తర్వాత యోగా చేయడం.. ఇదీ జకోవిచ్ కుటుంబం లేవగానే చేసే దినచర్య. ఇద్దరు పిల్లల తండ్రి అయిన అతను కుటుంబానికి అధిక ప్రాముఖ్యతనిస్తాడు. కలిసి మాట్లాడుకుంటే మనసులో ఎలాంటి ఆందోళనలు ఉండవని నమ్ముతాడు. అందుకే ప్రతి రోజూ ఉదయం కుటుంబంతో కలిసి పాటలు పాడతాడు. ఆ తర్వాత ఒకరికొకరు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు.