సెర్బియా, క్రొయేషియా టెన్నిస్ ఎగ్జిబిషన్ సిరీస్‌లో పాల్గొన్న నొవాక్ జకోవిచ్‌కు కరోనా సోకినట్లు తేలింది. మంగళవారం జకోవిచ్‌కు చేసిన కరోనా పరీక్షలో అతనితో పాటు తన భార్య జెలెనాకు కరోనా నిర్ధరణ అయ్యిందని స్పష్టం చేశాడు సెర్బియా స్టార్.
"మేము బెల్గ్రేడ్ చేరుకున్నాక కరోనా పరీక్ష చేయించుకున్నాం. నా భార్య జెలెనా జకోవిచ్‌కు, నాకూ కరోనా సోకినట్లు తేలింది. కానీ, మా పిల్లలకు మాత్రం నెగటివ్ వచ్చింది. నేను రాబోయే 14 రోజుల స్వీయ నిర్బంధంలో ఉంటాను. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షించనున్నారు."
- నొవాక్ జకోవిచ్, టెన్నిస్ క్రీడాకారుడు
కరోనా నేపథ్యంలో ఆటగాళ్లను ఒకచోట చేర్చి టోర్నీ నిర్వహించిన తీరుపై.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఎగ్జిబిషన్ సిరీస్‌లో పాల్గొన్నవారెవరూ భౌతిక దూరాన్ని పాటించలేదని తెలుస్తోంది. విక్టర్ పాటు ద్రిమితోవ్, బోర్నా కోరిక్ తర్వాత కరోనా సోకిన నాలుగో టెన్నిస్ క్రీడాకారుడు జకోవిచ్.
జకో ఆధ్వర్యంలోనే...
17 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ టోర్నీ జరుగుతుంది. శనివారం దిమిత్రోవ్‌కు కరోనా వచ్చిందని తెలిసిన నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన ఫైనల్‌ను రద్దు చేశారు. ఆ మ్యాచ్ రద్దైన తర్వాత కుటుంబంతో సహా జకోవిచ్.. క్రొయేషియా నుంచి బయలుదేరి బెల్గ్రేడ్ చేరుకున్నాడు. అక్కడ జకోవిచ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా.. జకోవిచ్‌కు అతని భార్యకు వైరస్ సోకినట్లు తేలింది. అయినా తన ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ ఎగ్జ్బిషన్ను సమర్థించుకున్నాడు జకోవిచ్.
ఈ టోర్నీలో పాల్గొన్న మరో టెన్నిస్ క్రీడాకారుడు విక్టర్‌తో పాటు గర్భిణీ అయిన తన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 13 నుంచి జులై 5 వరకు సెర్బియా, క్రొయేషియా, మాంటెనెగ్రోలోని మట్టి కోర్టుల్లో ఈ టోర్నీకి సంబంధించి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో జకోవిచ్, డొమినిక్ థీమ్‌తో పాటు గ్రిగర్ దిమిత్రోవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ వంటి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు.